పవన్ ఫుల్ సైలెంట్...ఎందుకలా ?
ఇక మల్లాం గ్రామంలో జరిగిన ఈ ఘటన 21వ శతాబ్దంలో కూడా ఇంకా కుల వివక్ష ఉందా అన్న చర్చని రేకెత్తిస్తోంది.
By: Tupaki Desk | 24 April 2025 4:44 AMజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఒక వైపు చూస్తే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితులను సామాజిక బహిష్కరణ అంశం కాక రేపుతోంది. ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. ఎవరో అజ్ఞాత దుష్ట శక్తి ఈ విధంగా చేశారు అని జనసేన పిఠాపురం ఇంచార్జి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే నిజమైతే ఆ దుష్ట శక్తిని బయటకు తేవాలి కదా చట్టం ముందు పెట్టాలి కదా అన్నది కూడా అంతా అడుగుతున్నారు.
ఇక మల్లాం గ్రామంలో జరిగిన ఈ ఘటన 21వ శతాబ్దంలో కూడా ఇంకా కుల వివక్ష ఉందా అన్న చర్చని రేకెత్తిస్తోంది. అంతే కాదు దళితులకు దూరంగా పెట్టడం, వారికి కిరాణా సామాను కూడా ఎవరూ ఇవ్వరాదని శాసించడం ఇదంతా చూస్తూంటే అసలు ఏమి జరుగుతోంది అన్నది చర్చగా ఉంది.
అయితే ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా పవన్ నుంచి ప్రకటన కానీ మరోటి కానీ అంతా ఆశిస్తున్నారు. అయితే ఆయన సైలెంట్ గా ఉండడం పట్ల అయితే విపక్షాలు విమర్శిస్తున్నాయి. వామపక్ష నాయకులు అయితే ఈ విషయంలో లోకల్ ఎమ్మెల్యేగా పవన్ జోక్యం చేసుకోవాల్సి ఉంది అని అంటున్నారు.
పవన్ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడితే మెగా బ్రదర్ ఎమ్మెల్సీ అయిన నాగబాబు అయినా పిఠాపురం వచ్చి వ్యవహారం చక్కబెట్టాలి కదా అని అంటున్నారు. అంతే కాదు బాధ్యులు ఎవరో గుర్తించి తగిన విధంగా చట్ట ప్రకారం శిక్షించేలా చూడాలని అంటున్నారు. దుష్ట శక్తులు అని రాజకీయ రంగు పులమడం వల్ల సమస్య తీవ్రత తగ్గదని అంటున్నారు.
మరో వైపు చూస్తే మల్లాం గ్రామాన్ని పిఠాపురం వైసీపీ ఇంచార్జి వంగా గీత సందర్శించి దళిత కుటుంబాలను పరామర్శించారు. వారి ఆవేదనకు సంఘీభావం ప్రకటించారు. అదే విధంగా వామపక్ష నాయకులు సైతం మల్లాం గ్రామాన్ని సందర్శించారు. ఒక విధంగా ఇది సామాజిక కోణంలో ఇబ్బందికరమైన విషయం గానే ఉంది. దాంతో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టి ఇష్యూని సామరస్యంగా సెటిల్ చేయాల్సి ఉందని అంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఈ మధ్య 16వ ఆర్ధిక సంఘం అమరావతి సందర్శన సమయంలో కనిపించారు. ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత నుంచి ఆయన కనిపించడం లేదు. కేబినెట్ మీటింగ్ కి వచ్చిన సందర్భంలోనే పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతునారు. దాంతో ఇపుడు హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి రెస్ట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు.
అయితే ప్రజా సంఘాలు వామపక్షాలు, విపక్షాలు మల్లాం ఇష్యూ మీద డిబేట్లు పెడుతున్నాయి. ఆ గ్రామంలో పర్యటనలు చేస్తూ ఈ అంశాన్ని వేడిగానే ఉంచుతున్నాయి. దాంతో దీనికి ఒక అర్ధవంతమైన ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రిగా స్థానిక ఎమ్మెల్యేగా పవన్ మీదనే ఉందని అంటున్నారు
అయితే కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు అధికారులు అప్రమత్తం అయ్యారు శాంతి కమిటీలు పెట్టారు. కానీ అసలైన నిందితులను గుర్తించడం చట్టం ముందు వారిని నిలబెట్టడం చేయాలన్న డిమాండ్ వస్తోంది. ఎవరు కుల బహిష్కరణకు ఆదేశించారో వారిని గుర్తించాలని ఈ విషయంలో రాజకీయాలు అతీతంగానే పనిచేస్తేనే సమస్యకు ముగింపు ఉంటుందని అంటున్నారు. ఇక చూస్తే కనుక ఇంతటి కీలకమైన అంశంలో పవన్ మౌనంగా ఉండడం మంచిది కాదనే అంటున్నారు. మరి ఆయన ఏమి చేస్తారో చూడాల్సి ఉంది.