Begin typing your search above and press return to search.

పవన్ ది తమ్ముడు పాత్రేనా ?

మరి ఈ సమయంలో పవన్ లోని సనాతనీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 April 2025 9:46 PM IST
పవన్ ది తమ్ముడు పాత్రేనా ?
X

టీడీపీ కూటమి ప్రభుత్వంలో పవన్ ది చాలా పవర్ ఫుల్ పాత్ర అని జనసైనికులతో పాటు ఒక బలమైన సామాజిక వర్గం వారు మొదట్లో బాగా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే రాను రానూ పవన్ తన పరిధిని పాత్రను తగ్గించేసుకుంటున్నారా అన్న చర్చ వస్తోంది. పవన్ కళ్యాణ్ కి సొంతంగా ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి కొన్ని నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. పైగా ఆయన హిందూత్వ సనాతన ధర్మం అని ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు.

అలాటిది సింహాచలంలో ఒక నాసిరకం పనితీరులో అప్పటికప్పుడు ఒక గోడ కట్టితే దాని కిందనే పడి అమాయక భక్తులు చనిపోయారు. మరి ఈ సమయంలో పవన్ లోని సనాతనీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నలు వస్తున్నాయి. దేవుడి దర్శనానికి వెళ్తే ప్రాణాలు ఇవ్వాలా అని పవన్ మాట్లాడటం లేదు ఎందుకు అని అంటున్నారు.

దాని కంటే ముందు చూస్తే ఆయన తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అని ప్రాయశ్చిత్త దీక్ష చేశారని గుర్తు చేస్తున్నారు. అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి వేళ ఆరుగురు భక్తులు చనిపోతే క్షమాపణలు టీటీడీ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి ఇపుడు సింహాచలం చలం ఘటనకు కూడా అదే థియరీ వర్తిస్తుంది కదా ఇపుడు ఆలయ అధికారులతో పాటు ఎవరెవరు క్షమాపణలు చెప్పాలో పవన్ సూచిస్తూ అడగరా అని అంతా అంటున్నారు

కూటమి ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పే హక్కు జనసేనకు ఉంది కదా అని గుర్తు చేస్తున్నారు. అధికారుల వైఫల్యం సింహాచలం ఘటనలో కనిపిస్తూంటే పవన్ నోరు చేసుకోవాలి కదా అని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏమి జరిగినా పవన్ గట్టిగా మాట్లాడేవారు అని ఇపుడు కూటమి ప్రభుత్వం కదా అని ఉదాశీనంగా ఉంటే ఆయన సనాతనీ ఫిలాసఫీకి అర్ధం ఉంటుందా అన్న చర్చ కూడా చేస్తున్నారు.

ఇక కూటమిలో పెద్దన్నగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటే తమ్ముడి పాత్రలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినాయకుడు ఒదిగిపోయారా అని అంటున్నారు. ఒక విధంగా పవన్ సైలెంట్ గా కీలకమైన అంశాలలో ఉండడం వల్ల ఆయన పొలిటికల్ ఇమేజ్ కే ఇబ్బందిని తెస్తుందని అంటున్నారు. కాశీనాయన ఆశ్రమంలో సత్రాలను కూల్చివేసిన ఘటన మీద కూడా పవన్ మౌనంగానే ఉన్నారని గుర్తు చేస్తున్న వారు ఉన్నారు.

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయమని డిమాండ్ చేసిన ఏకైక నాయకుడుగా పవన్ నిలిచారని చెబుతున్నారు అలాంటపుడు దేవాలయాలలో అధికారుల నిర్వాకం వల్ల సక్రమంగా పాలన సాగకపోవడంతో ఆస్తిక జనులు ప్రాణాలను బలి పెడుతున్న తీరుని ఆయన ఎండగడితే బాగుంటుంది కదా అని అంటున్నారు.

హిందూ ధార్మిక సంస్థలు అయితే దేవాలయాల పర్యవేక్షణ అంతా ప్రభుత్వాలు రాజకీయ నేతల నుంచి వారి అజమాయిషీ నుంచి బయటకు తెచ్చి మఠాధిపతులకు పీఠాధిపతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఏమంటారో చెప్పాలని కోరుతున్నారు. ఏది ఏమైనా పవన్ కూటమి ప్రభుత్వం తరఫున జరిగిన సంఘటన పట్ల బాధను అయితే వ్యక్తం చేశారు కానీ పవర్ ఫుల్ పొలిటీషియన్ గా జనాలలో ఆయనకు ఉన్న ఇమేజ్ కి తగినట్లుగా స్ట్రాంగ్ రియాక్షన్ అయితే ఇవ్వలేకపోయారు అన్న వెలితి అయితే ఉందని అంటున్నారు.