పవన్ సౌండ్ తగ్గుతోందా ?
ఇక పవన్ కూడా ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి ఈసారి ప్రభుత్వం తీరులో మౌలికమైన మార్పులు కనిపిస్తాయని అంతా భావించారు. కానీ ఏడాది కూటమి పాలనలో ఎక్కడా పవన్ మార్క్ అన్నది పెద్దగా లేదని అంటున్నారు.
By: Tupaki Desk | 6 Jun 2025 3:43 AMఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్య భాగస్వామ్య పార్టీగా జనసేన ఉంది. జనసేనకు 21 సీట్లు మాత్రమే ఉండవచ్చు. కానీ అక్కడ ఉన్నది పవర్ స్టార్. నిండుగా గ్లామర్ తో పాటు అండగా బలమైన సామాజిక వర్గం ఉన్న పవన్ చరిష్మాయె కూటమికి శ్రీరామ రక్ష అన్నది తెలిసిందే. ఏపీలో 2024లో కూటమి అధికారంలోకి రావడం వెనక పవన్ ఫ్యాక్టర్ ఎంతగానో పనిచేసింది.
ఇక పవన్ కూడా ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి ఈసారి ప్రభుత్వం తీరులో మౌలికమైన మార్పులు కనిపిస్తాయని అంతా భావించారు. కానీ ఏడాది కూటమి పాలనలో ఎక్కడా పవన్ మార్క్ అన్నది పెద్దగా లేదని అంటున్నారు. జనసేన కూడా ప్రజల కోసం కొన్ని అనుకుంది. జనసేన అయిదేళ్ల పాటు తన సభలూ సమావేశాలలో వాటిని చెబుతూ వచ్చింది.
నిరుద్యోగ యువతకు పది లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా వారితో పరిశ్రమలు పెట్టించాలని తద్వారా వారి నుంచి మరో పది మందికి ఉపాధి దక్కేలా చూడాలని ప్రతిపాదించింది. అయితే ఏడాది పాలనలో దాని గురించి ప్రస్తావన అయితే లేదని అంటున్నారు.
ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో పవన్ ఉన్నారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబుతో పాటుగా పవన్ ఫోటో కూడా పెడుతున్నారు. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో జనసేన పాత్ర ఏ మేరకు ఉంది అన్నది తెలియడంలేదు అని అంటున్నారు. ఇక అమరావతి రాజధానితో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రాజెక్టులను మంజూరు చేయాలని మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య జనసేనకు లేఖ రాశారు. దాని మీద కూడా జనసేన పెద్దగా రియాక్ట్ కాలేదని అంటున్నారు. అలాగే ఆర్ధికంగా వెనకబడిన వారికి ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో అయిదు శాతం కాపులకు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. దానికి కూడా స్పందించినది లేదు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ప్రభుత్వం మీద సహజంగానే తెలుగుదేశం ముద్ర ఉంది. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో 2014 నుంచి 2019 దాకా సాగిన టీడీపీ ప్రభుత్వంగానే అత్యధిక శాతం పాలన ఉంది. కానీ కూటమి పాలనగా కనిపించడం లేదని అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ ఆరోపిస్తోంది. రాజకీయ కక్ష సాధింపులకు వ్యతిరేకం అని అధికారంలోకి వచ్చిన కొత్తలో పవన్ చెప్పారని గుర్తు చేస్తున్నారు. మరి రెడ్ బుక్ పేరుతో సాగుతున్న కార్యక్రమాల మీద జనసేన కూడా అంగీకారం గా ఉందా అని వైసీపీ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి.
మరో వైపు చూస్తే మొదట్లో పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు, మహిళల మీద అత్యాచారాలు కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న అక్రమ బియ్యం విషయం గురించి కానీ తిరుపతి తొక్కిసలాట మీద కానీ ఆయన తనదైన స్టాండ్ తీసుకుని మాట్లాడారు. కానీ ఆ తర్వాత అయితే పెద్దగా సౌండ్ లేదని అంటున్నారు.
దీంతో ఏపీలో రొటీన్ పాలన సాగుతోందని అందులో జనసేన పాత్ర పెద్దగా ఏమీ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. వీధి వీధినా బెల్ట్ షాపులు వచ్చేస్తున్నాయి. అలాగే ఇసుక దందాలు సాగుతున్నాయి. అవినీతి అక్రమాలు అలాగే ఉన్నాయి. మరి వీటి మీద జనసేన చెప్పాల్సింది లేదా అని అంటున్నారు. ఏది ఏమైనా అయిదేళ్ళ వైసీపీ పాలనలో గట్టిగా వినిపించిన పవన్ వాయిస్ ఇపుడు అయితే సౌండ్ బాగా తగ్గింది అని అంటున్నారు. అయితే ప్రభుత్వంలో ఉండడం వల్ల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది అనుకున్నా నాలుగు గోడల మధ్యన చెప్పాల్సింది చెప్పినా తీరు తెన్నులలో మార్పు వచ్చేది కదా అంటున్నారు.