Begin typing your search above and press return to search.

ముంబైలో పవన్ కు శస్త్రచికిత్స, నాలుగు వారాల సెలవు!?

భుజాల నొప్పితో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చికిత్స నిమిత్తం శుక్రవారం ముంబై వెళ్లనున్నారు.

By:  Tupaki Desk   |   9 July 2026 4:01 PM IST
ముంబైలో పవన్ కు శస్త్రచికిత్స, నాలుగు వారాల సెలవు!?
X

భుజాల నొప్పితో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చికిత్స నిమిత్తం శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. గత వారమే ఆయన ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకోగా, వెనువెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు అధికారిక కార్యక్రమాలు ఉండటం వల్ల అప్పట్లో ఆయన శస్త్రచికిత్స చేయించుకోలేకపోయారు. ఇక భుజాలు, కండరాల నొప్పి ఎక్కువ అవుతుండటం వల్ల వారం పాటు అన్నింటిని వాయిదా వేసి శస్త్రచికిత్స నిమిత్తం ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ముంబైలో ప్రఖ్యాత కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కు శస్త్రచికిత్స జరగనుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

వారం క్రితమే వైద్య పరీక్షలు

గత వారమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలోని అంబానీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన రెండు భుజాలలో నరాలు చిట్లాయని వైద్యులు గుర్తించారు. పరీక్షల అనంతరం, పరిస్థితి తీవ్రతను బట్టి వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే, బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన అప్పట్లో చికిత్సను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు రాజకీయ పనులకు కాస్త విరామం దొరకడంతో, చికిత్స కోసం మరోసారి ముంబై బయలుదేరుతున్నారు.

సమస్య ఎందుకొచ్చింది?

పవన్ కళ్యాణ్ వృత్తిరీత్యా పలుమార్లు గాయాలకు గురయ్యారని అంటున్నారు. సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించే సమయంలో ఆయన గాయపడినట్లు చెబుతున్నారు. అనేక చిత్రాల్లో కష్టతరమైన ఫైట్ సీక్వెన్స్‌లను డూప్ లేకుండా, స్వయంగా చేయడం వల్ల ఆయన భుజాల కండరాలపై తీవ్ర ఒత్తిడి పడిందని చెబుతున్నారు. ముఖ్యంగా భుజం కీళ్లలో ఉండే 'రోటేటర్ కఫ్' కండరాలు దెబ్బతినడం వల్ల తరచూ నొప్పితో బాధపడాల్సివస్తోందని అంటున్నారు. అయితే చాలాకాలం ఈ సమస్యను ఆయన తేలిగ్గా తీసుకోవడం వల్ల ఇప్పుడు తీవ్రమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నాలుగు వారాల పాటు విశ్రాంతి?

ముంబైలోని నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో పవన్ కు చికిత్స జరగనుంది. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలంలో ఆయన ఎటువంటి శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పవన్ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. నాలుగు వారాలు అంటే దాదాపు నెల రోజుల పాటు అధికారిక కార్యక్రమాలకు పవన్ దూరంగా ఉండేందుకు ఇష్టపడతారా? అన్నది చర్చనీయాంశం అవుతోంది. గత ఏప్రిల్ నెలలో కూడా పవన్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. సైనస్ తో బాధపడిన పవన్ అత్యవసరంగా హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నారు. అయితే విశ్రాంతి అనంతరం ఆయన కొద్దిరోజుల్లోనే తిరిగి అధికార, రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇప్పుడు రెండు భుజాలకు ఒకేసారి చికిత్స జరుగుతుండటం వల్ల పవన్ నెలరోజులు విశ్రాంతి తీసుకుంటారా? లేదా? అనేది చర్చనీయాంశం అవుతోంది.