కమ్యూనిస్టు నుంచి హిందూయిస్టుగా ఎలా మారానంటే.. పవన్ తాజా వివరణ!
సనాతన ధర్మంపై తన మాటలను విమర్శిస్తున్న వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 22 Jun 2025 6:52 PM ISTసనాతన ధర్మంపై తన మాటలను విమర్శిస్తున్న వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఒకప్పుడు కమ్యూనిజాన్ని ఇష్టపడిన పవన్ సనాతనంపై మాట్లాడటానికి బీజేపీ, ఇతర హిందూ సంస్థలే కారణమంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తాజాగా ఓ తమిళ మీడియా చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ తాను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పడానికి రాత్రికి రాత్రే జరిగిన మార్పు కాదని స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాల సంఘర్షణ తర్వాత సనాతన ధర్మంవైపు నిలబడాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పవన్ వివరించారు.
ఒకప్పుడు చే గువేరా అంటే ఇష్టమని చెప్పిన పవన్ ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షకుడి అవతారమెత్తడంపై విపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటుంది. ఆయన బీజేపీ ట్రాప్ లో పడ్డారని కమ్యూనిస్టు నేతలు ఎప్పటికప్పుడు దెప్పిపొడుతుస్తున్నారు. అయితే తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై పెద్దగా స్పందించని పవన్, తొలిసారి తాను సనాతనంపై మాట్లాడటానికి కారణాలు వెల్లడించారు.
తాను ఆకస్మాత్తుగా హిందూయిస్టుగా మారలేదని పవన్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా సనాతన ధర్మానికి మద్దతుగా ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. హిందూ దేవుళ్లు, ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. హిందూ మతంపై జరుగుతున్న దాడిని తాను తట్టుకోలేకపోయానని పవన్ స్పష్టం చేశారు. మత విశ్వసాలను అగౌరవపరచాలనే ప్రయత్నాలను తాను అంగీకరించలేకపోయానని పవన్ ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
సోషలిస్టు నుంచి హిందూయిస్టుగా మారడంపై స్పందిస్తూ రాత్రికి రాత్రి తాను అలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. క్రమంగానే తనలో మార్పు వచ్చిందని వివరించారు. సనాతన ధర్మం, హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయన్నారు పవన్. నా నమ్మకాల కోసం నిలబడాల్సిన అవసరం ఉందని, అందుకే సనాతన ధర్మాన్ని కాపాడేందుకు నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
సనాతనం పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయంగా పవన్ వెల్లడించారు. నేను సరైనది అని భావించినదే చేశానంటూ డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇక తనపై విమర్శలు చేయడాన్ని కూడా పవన్ తేలిగ్గా తీసుకున్నారు. ప్రజలు ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారని, తనతో విభేదించేవారు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో పవన్ రాజకీయంగా బాగా పరిణతి సాధించినట్లు కనిపిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
