సోషల్ మీడియాలో పోస్టు.. తక్షణం స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఈ నెల 16న ఎక్స్ లో రోడ్డు దుస్థితిపై పోస్టు రాగా, పవన్ ఆదేశాలతో 17న రోడ్డును పరిశీలించిన అధికారులు వెనువెంటనే మరమ్మతులు చేపట్టారు.
By: Tupaki Desk | 19 Sept 2025 1:00 AM ISTఅధికారిక విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై తన నిబద్ధతను చాటుకున్నారు. వర్షాలకు అధ్వానంగా మారిన తమ ఊరి రోడ్డును బాగు చేయాలని ఓ వ్యక్తి చేసిన పోస్టును సీరియస్ గా తీసుకున్న డిప్యూటీ సీఎం.. తక్షణం రోడ్డు మరమ్మతులపై ద్రుష్టి పెట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రోడ్డు మరమ్మతులకు ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేశారు. 24 గంటల్లోనే రోడ్డు సమస్యను పరిష్కరించిన డిప్యూటీ సీఎంపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం - అడ్డతీగల మధ్య రహదారి గుంతలమయంగా తయారైంది. చాలా కాలంగా రిపేర్లకు నోచుకోని ఈ రోడ్డు తాజా వర్షాల వల్ల ప్రయాణించడానికి వీలు లేకుండా తయారైంది. దీంతో చైతన్య రాజు అనే వ్యక్తి రోడ్డు దుస్థితిని తెలియజేసే విధంగా ఒక ఫొటోను ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. అంతేకాకుండా ఆ పోస్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశాడు. రోడ్డుపై గోతులు ఉన్నాయని, వాహనాల రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థుడు చైతన్యరాజు ఆ పోస్టులో వాపోయాడు. ఈ పోస్టును చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెనువెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పవన్ ఆదేశాలతో కాకినాడ జిల్లా ఆర్ అండ్ బి అధికారులు ఆఘమేఘాలపై స్పందించారు. ఈ నెల 16న ఎక్స్ లో రోడ్డు దుస్థితిపై పోస్టు రాగా, పవన్ ఆదేశాలతో 17న రోడ్డును పరిశీలించిన అధికారులు వెనువెంటనే మరమ్మతులు చేపట్టారు. 24 గంటల్లోనే గుంతలను కప్పి రోడ్డును సాధారణ స్థితికి తీసుకువచ్చారు. కాగా, 10.541 కిలోమీటర్ల రోడ్డును ఎన్.డి.బి. (New Development Bank of BRICS countries) నిధులతో కొత్తగా నిర్మించాలని సూచించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు.
రహదారుల నిర్వహణ, మరమ్మతులపై పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గుంతలు లేని రహదారులు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. పల్లె పండుగ పేరుతో గ్రామగ్రామాన రహదారులను నిర్మించారు. అదేవిధంగా గుంతల్లేని రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.800 కోట్లు వెచ్చించారు. కానీ, ఏలేశ్వరం- అడ్డతీగల రహదారి రూపు మారకపోవడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
