Begin typing your search above and press return to search.

ఏపీలో తెలంగాణ కాంట్రాక్టర్లు.. సీన్ రివర్సు అయ్యిందా?

అంతేకాదు.. తెలంగాణలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యాపారుల పాత్ర ఎక్కువైందని.. తెలంగాణ వారికి అవకాశాలు ఇవ్వకుండా ఏపీ వ్యాపారులు కాంట్రాక్టులను కొల్లగొట్టేస్తున్నట్లుగా కొందరు గగ్గోలు పెట్టేవారు.

By:  Garuda Media   |   3 Jun 2026 10:38 AM IST
ఏపీలో తెలంగాణ కాంట్రాక్టర్లు.. సీన్ రివర్సు అయ్యిందా?
X

తెలంగాణలో ఆంధ్రోళ్లకు ఏం పని? అంటూ కొందరు తరచూ వ్యాఖ్యలు చేస్తుంటారు. నోరు పారేసుకుంటారు. ఒకవేళ వారు అన్నట్లే.. ఏపీ రాష్ట్రానికి చెందిన వారు తెలంగాణలో ఎందుకు ఉంటున్నారు? తెలంగాణ వారి ఉపాధికి అడ్డు కలిగేలా.. వారి ఉద్యోగాల్ని లాగేసుకుంటున్నట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. అంతేకాదు.. తెలంగాణలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యాపారుల పాత్ర ఎక్కువైందని.. తెలంగాణ వారికి అవకాశాలు ఇవ్వకుండా ఏపీ వ్యాపారులు కాంట్రాక్టులను కొల్లగొట్టేస్తున్నట్లుగా కొందరు గగ్గోలు పెట్టేవారు.

తెలంగాణలో ఆంధ్రోళ్లకు ఏం పని? అన్న ప్రశ్నను విన్న ప్రతిసారీ పలువురిలో కొన్ని సందేహాలు వస్తుంటాయి. అదే నిజమైతే..తెలంగాణ ప్రాంతానికి చెందిన వారంతా తెలంగాణకే పరిమితం అయ్యారా? వేరే ప్రాంతాలకు వెళ్లలేదా? ఉపాధి పొందటం లేదా? అక్కడ తెలంగాణ వారు ఉండేందుకు అభ్యంతరం లేనప్పుడు ఏపీకి చెందినోళ్లు తెలంగాణలో ఎందుకు ఉండకూడదు? అన్నది ప్రశ్న. తెలంగాణలో ఏపీ వారి కారణంగా తెలంగాణవారి అవకాశాలుదెబ్బ తింటాయన్నదే వాదన అయితే.. అదే రూలు తెలంగాణవారు వెళ్లే ఇతర రాష్ట్రాలకు.. దేశాలకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది కదా?

తెలంగాణలో ఏపీవాళ్లు.. ఆంధ్రోళ్లకు పనేమిటని ప్రశ్నించే వారు తొలుత తెలంగాణ వారు ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకొని.. అందరూ తిరిగి తెలంగాణకు వచ్చేసి ఉండిపోవాలే తప్పించి.. ఇతర రాష్ట్రాల్లోనూ.. దేశాల్లోనూ ఎందుకు ఉన్నట్లు? అని ప్రశ్నిస్తే ఎంత పిచ్చిగా ఉంటుంది? అలానే తెలంగాణలో ఆంధ్రోళ్లకు ఏం పని అనటంలోనూ అలాంటి తీరే ఉంటుందన్న విషయాన్ని ఎందుకు విస్మరిస్తారు? అన్నది ప్రశ్న.

తెలంగాణ ఉద్యమ వేళలోనే కాదు.. ఆ తర్వాత కూడా తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లకు.. వ్యాపారులకు ఏం పని అన్న ప్రశ్న అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ తరహా అంశాన్ని ప్రస్తావించటం గమనార్హం. ‘‘బీఆర్ఎస్ అధినేత మహారాష్ట్ర.. పంజాబ్ లలో పర్యటించొచ్చు. జనసేనకు చెందిన నేతను ఏపీలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించోచ్చు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు. ఇంత చేసి.. పవన్ కల్యాణ్ మాత్రం తెలంగాణలో పర్యటించకూడదా? జనసేనను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమంటే ఎలా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో ఆంధ్రా వారికి ఏం పని ప్రశ్నించేవారికి..ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లు..తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లు చేసే పనులు కనిపించటం లేదా? అంటూ పవన్ సూటిగా ప్రశ్నించిన వైనం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగానలో ఏం పని అని అడిగేవారికి.. మళ్లీ ఆ మాట మాట్లాడలేని విధంగా పవన్ తాజా సమాధానం ఉందని చెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్ల పనేమిటన్న ప్రశ్నను సంధించినంతనే.. ఏపీలో తెలంగాణ కాంట్రాక్టర్లకు పనేమిటో? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా పవన్ పుణ్యమా అని.. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు మాత్రమే కాదు.. ఏపీలో తెలంగాణ కాంట్రాక్టర్లు పోషిస్తున్న పాత్రను చెప్పటం ద్వారా.. కొన్ని రంగాలకు చెందిన వారికి ప్రాంతీయ సరిహద్దులు గీయటం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లైంది.