Begin typing your search above and press return to search.

మీరు ఫుష్ప అయితే గబ్బర్ సింగ్ ఇక్కడ.. స్మగ్లర్లకు పవన్ హెచ్చరిక

ఎర్రచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగు ఇచ్చారు. ఇప్పటికి నలుగురు కింగ్ పిన్స్ గుర్తించామని, వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు

By:  Tupaki Desk   |   8 Nov 2025 8:52 PM IST
మీరు ఫుష్ప అయితే గబ్బర్ సింగ్ ఇక్కడ.. స్మగ్లర్లకు పవన్ హెచ్చరిక
X

ఎర్రచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగు ఇచ్చారు. ఇప్పటికి నలుగురు కింగ్ పిన్స్ గుర్తించామని, వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. శనివారం తిరుపతి జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శేషాచలం అడవుల్లో విస్తృతంగా పర్యటించారు. అడవిలో సుమారు 4 కిలోమీటర్లు ప్రయాణించి, రెండు కి.మీ. మేర కాలినడకన అడవిలో తిరిగారు. నరికేసిన ఎర్ర చందనం చెట్లు మొదళ్లను చూసి పవన్ తీవ్రంగా చలించిపోయారు.




గత ప్రభుత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగు విచ్చలవిడిగా జరిగిందని పవన్ ఆరోపించారు. అటవీశాఖ గోడౌన్ లో ప్రస్తుతం 2.60 లక్షల దుంగలు నిల్వ ఉన్నాయని, ఇవన్నీ గతంలో అక్రమంగా నరికేసినవేనని చెప్పారు. రెండు దుంగలు కలిపి ఒక చెట్టు అనుకున్నా, మొత్తం 1.30 లక్షల చెట్లు నరికివేసినట్లు భావించాలని అన్నారు. ఈ ఎర్రచందనం విలువ మార్కెట్ రేటు ప్రకారం రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని పవన్ వివరించారు. ఇదంతా పట్టుకున్న ఎర్ర చందనమేనని, పట్టుకోనిది ఇతర దేశాలకు తరలిపోయినది మరో రూ.8 వేలు కోట్లు వరకు ఉంటుందని పవన్ అనుమానం వ్యక్తం చేశారు.




ఎర్ర చందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతోనూ ఈ విషయంలో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఒకే దేశంలో ఉన్నప్పటికీ ఏపీ, కర్ణాటక మధ్య దొంగ సొత్తు అప్పగించే ఒప్పందం లేదని, దీనివల్ల గతంలో కర్ణాటక స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలం వేసి రూ.140 కోట్లు సంపాదించిందని పవన్ తెలిపారు. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర అటవీ అధికారులే తనకు తెలిపారన్నారు. కుంకీ ఏనుగుల కోసం తాను కర్ణాటక వెళ్లిన సమయంలో మాటల సందర్భంలో ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక అటవీశాఖ ట్యాంక్స్ చెప్పాల్సివుందని అన్నారని, దీనికి ఎర్ర చందనం దుంగల వేలం ద్వారా వచ్చిన డబ్బే కారణమని పవన్ వివరించారు.

శేషాచలం అడవుల్లో మాత్రమే ఉండే ఎర్రచందనం చెట్లు పర్యావరణాన్ని కాపాడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ తెలిపారు. ఈ చెట్లు నరికివేతలో స్థానికులు పాల్గొనొద్దని హితవుపలికారు. ఆపరేషన్ కగార్ అమలు చేస్తున్న ఈ దేశంలో ఎర్ర చందనం స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద లెక్క కాదన్న విషయం గమనించాలని స్పష్టం చేశారు. స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే ఎలాంటి చర్యలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఒకసారి ఆపరేషన్ మొదలుపెడితే.. వెనుదిగిరే ప్రసక్తే ఉండదు. ఎర్ర చందనం నరికివేతలో పాల్గొంటున్న తమిళనాడు కూలీలకు అవగాహన కల్పిస్తామని పవన్ వెల్లడించారు. ఎర్ర చందనం చెట్లకు ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. వెంకటేశ్వరస్వామి గాయం నుంచి ఎర్రచందనం పుట్టిందని పురాణాలు ద్వారా తెలుస్తోంది. వెంకటేశ్వరస్వామి భక్తులు చెట్లను రక్షించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.