రప్పా రప్పా అంటే తొక్కి నార తీస్తాం...పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈ డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని అన్నారు. బయట అలా మాట్లాడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 3:21 PMరప్పా రప్పా అంటూ ఈ మధ్య ఏపీ రాజకీయాలలో సౌండ్ వినిపిస్తోంది. జగన్ పల్నాడు టూర్ లో ఫ్లెక్సీలతో ఒక యువకుడు దానిని ప్రదర్శించాడు. దాని మీద జగన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా డైలాగులు అవి అని లైట్ తీసుకున్నారు. అందులో తప్పేముందని అన్నారు. ఆపై జగన్ కూడా రప్పా రప్పా అని డైలాగ్ కొట్టారు.
అయితే దానికి సుపరిపాలన లో తొలి అడుగు సభలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచకం చేస్తామంటే కుదరదు అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అంతే తప్ప మెతక ప్రభుత్వం కాదని అన్నారు.
అసాంఘిక శక్తులను ఏరి వేస్తామని అన్నారు. తొక్కి నార తీస్తామని అన్నారు. రోడ్లెక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు ఊరుకోమని అన్నారు. గొంతు కోస్తామని కుత్తుకలు కోస్తామని అంటే అసలు ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు.
అలా ఎవరైనా చేయాలనుకుంటే మక్కెలిరగగొట్టి ఇంట్లో కూర్చోబెడతామని గట్టిగా హెచ్చరించారు. సరదాగా ఇక్కడ ఎవరూ కూర్చోలేదని అన్నారు. అధికారంలో ఉన్నపుడు అరాచకాలు సృష్టించారని ఇపుడు కూడా అలాగే చేద్దామనుకుంటే మాత్రం ఊరుకోమని స్పష్టం చేశారు.
ఈ డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని అన్నారు. బయట అలా మాట్లాడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఇదిలా ఉంటే తాము ఎన్నో ఎదురు దెబ్బలు తిని అధికారంలోకి వచ్చామని అన్నారు. వైసీపీ నేతలు చేసే తాటాకు చప్పుళ్లకు అసలు ఎవరూ బెదిరిపోరని అన్నారు.
వైసీపీ అరాచకాలు అయిదేళ్ళ పాటు సాగాయని గతాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. విశాఖలో ఒక హొటల్ లో తనను రోజంతా ఉంచేశారు అని చంద్రబాబుని సైతం అరెస్ట్ చేశారని వేధించారని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో సగటు మనిషి ఉంచి పెద్ద వారి వరకూ ఎవరికీ రక్షణ లేదని అన్నారు.
ఆనాడు రాజకీయ నాయకత్వం వ్యవహరించిన తీరుతో అంతటా భయం ఏర్పడింది అన్నారు. ఆ భయం అనే చీకటి నుంచి ఏపీకి వెలుగు వస్తుందా అని తనతో పాటు అంతా ఎదురుచూశారని పవన్ అన్నారు. అందుకే టీడీపీ జనసేన బీజేపీ కలసి ఏపీలో కూటమిగా ఏర్పడ్డాయని ప్రజలు కూడా ఈ కూటమికి తగిన మద్దతు ఇచ్చి అధికారం అప్పగించారని పవన్ గుర్తు చేశారు
ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కూడా ఎక్కడ కూడా రాజీ పడవద్దని పవన్ సూచించారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని అదే సమయంలో అరాచకం అన్న మాట లేకుండా అణచివేయాలని సూచించారు. ఏడాది పాలనలో కూటమి ఎంతో చేసిందని అన్నారు. రానున్న కాలంలో మంచి చేస్తుందని అన్నారు.
మొత్తానికి చూస్తే జగన్ రప్పా రప్పా వ్యాఖ్యలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు. ఆయనలో చాలా కాలం తరువాత మళ్ళీ ఒకనాటి ఆవేశం కనిపించింది అన్నారు. తొక్కి పట్టి నార తీస్తామని పవన్ అన్నారు. అధికారిక సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు కానీ తాను తప్పక చెబుతున్నాను అని ఆయన అన్నారు. లా అండ్ ఆర్డర్ గట్టిగా ఉంటుందని ప్రజలకు ఆయన అదే వేదిక మీద నుంచి హామీ ఇచ్చారు. అంతే కాదు కూటమి మంచి పాలన అందిస్తునని పవన్ కళ్యాణ్ మరోసారి భరోసా ఇచ్చారు.