Begin typing your search above and press return to search.

శర్మిష్ఠ కోసం పవన్... మమతా బెనర్జీ సర్కార్ పై తీవ్ర విమర్శలు!

ఆపరేషన్ సిందూర్ పై మతతత్వ ఆరోపణలు చేసిన సోషల్ మీడియా పోస్ట్ పై కోల్ కతా పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   1 Jun 2025 3:54 PM IST
శర్మిష్ఠ కోసం పవన్... మమతా బెనర్జీ సర్కార్ పై తీవ్ర విమర్శలు!
X

ఆపరేషన్ సిందూర్ పై మతతత్వ ఆరోపణలు చేసిన సోషల్ మీడియా పోస్ట్ పై కోల్ కతా పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలిని అరెస్ట్ చేశారు. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

మతపరమైన పోస్ట్ పై శర్మిష్ఠ పనోలిని అరెస్ట్ చేయడానికి కోల్ కతా పోలీసులు తీసుకున్న చర్య రాజకీయంగా పెను దుమారాన్ని రేపింది! ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లౌకికవాదం రెండు వైపులా ఉండాలని నొక్కి చెప్పారు.

పహల్గాం ఉగ్రదాడిని ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మాట్లాడనందుకు బాలీవుడ్ నటులను లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడుతూ, మతతత్వ పదజాలాన్ని ఉపయోగించారనే ఆరోపణలపై 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలిని కోల్ కతా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆమెపై మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెట్టడం, శాంతికి విఘాతం కలిగించే పనులకు పూనుకోవడం వంటి వాటితో సంబంధం ఉన్న బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు! అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఈ సందర్భంగా స్పందించిన పవన్... ఆపరేషన్ సిందూర్ సమయంలో, న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ తన మాటలతో తీవ్రంగా స్పందించింది, ఆమె మాటలు కొంతమందికి బాధ కలిగించాయి. అయితే.. ఆమె తన తప్పును అంగీకరించి, వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పింది. ఇదే సమయంలో.. ఆమెపై పశ్చిమ బెంగాల్ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారు అని అన్నారు.

అనంతరం... ఎన్నికైన నాయకులు, టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు, లక్షలాది మందికి లోతైన బాధను కలిగించిన సంగతి ఏమిటి? మన విశ్వాసాన్ని గాంధ ధర్మ అని పిలిచినప్పుడు ఆ అగ్రహం ఎక్కడ ఉంది? వారి క్షమాపణలు ఎక్కడ? వారి అరెస్ట్ ఎక్కడ? అంటూ పవన్ ప్రశ్నించారు. దైవదూషణను ఎల్లప్పుడు ఖండించాలని అన్నారు.

ఈ సందర్భంగా... లైకికవాదం అనేది కొంతమందికి కవచం కాదని, ఇదే సమయంలో మరికొంతమందికి కత్తి కాదని.. అది టూ వే స్ట్రీట్ అయి ఉండాలని తెలిపారు. ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ పోలీసులవైపు దేశం చూస్తోందని.. అందరికీ సమన్యాయంగా వ్యవహరించాలని అన్నారు.