'రప్పా.. రప్పా..' డైలాగు సినిమా హాలు వరకే..
అయితే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By: Tupaki Desk | 20 Jun 2025 9:51 AMమాజీ సీఎం జగన్ పర్యటన సందర్బంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లపై విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు జగన్ వెళ్లిన సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమా డైలాగైన ‘రప్పా.. రప్పా నరుకుతాం’ బ్యానర్లను ప్రదర్శించారు. 2029లో తాము అధికారంలోకి వస్తే నరికేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించడంపై టీడీపీ తోపాటు కూటమి నేతలు మండిపడుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గురువారం స్పందించి వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ సైతం సినిమా డైలాగును వాడితే తప్పేముందని ప్రశ్నించారు? ఈ ప్రభుత్వంలో సినిమా డైలాగులు కూడా వాడటం నేరమేనా? అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
అయితే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమా డైలాగులు హాలులో వినటానికే బాగుంటాయి.. నిజ జీవితంలో ఆచరించటానికి కాదంటూ డిప్యూటీ సీఎం పవన్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా చట్టాన్ని ఉల్లంఘించి విద్వేషపూరిత ప్రసంగాలు చేసే నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సినిమా డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, ఆ డైలాగులను ప్రజాస్వామ్యంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదని పవన్ వ్యాఖ్యానించారు. ఎవరైనా చట్టాన్ని నియమ నిబంధనలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏంటో ప్రజలు గుర్తించాలని డిప్యూటీ సీఎం కోరారు.
అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సినిమా డైలాగులను ఆచరణలో పెడతామంటే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ప్రభుత్వం నిర్దేశించినట్లు పవన్ వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.
అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని అవసరమైతే రౌడీ షీట్లు తెరుస్తామని పవన్ స్పష్టం చేశారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా, వారిని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని పవన్ కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అవుతుందని పవన్ హితవుపలికారు. అయితే మాజీ సీఎం జగన్ కు కౌంటర్ గా పవన్ మాట్లాడినా, ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.