సేనానీ...ప్రశ్నించాలని ఉందోయ్ !
అలా పవన్ కళ్యాణ్ 2017 తవరువాత ఏపీలో టీడీపీని కేంద్రంలో బీజేపీని గట్టిగానే నిలదీశారు.
By: Tupaki Desk | 29 April 2025 5:00 AM ISTపవన్ కళ్యాణ్ ఒక రేర్ పర్సనాలిటీ. ఆయన రాజకీయ నాయకుడు అవునా కాదా అన్నది పక్కన పెడితే సగటు మనిషి నైజం ఆయనలో ఉంది. అందుకే ఆయన ఎవరూ చేయని ఒక సూత్రాన్ని తయారు చేశారు. దానినే ఆయన సిద్ధాంతీకరించారు. జనసేనకు అదే ప్రాణ వాయువుగా మార్చారు.
దాని పేరే ప్రశ్నించడం. అవును తాను ప్రశ్నిచడం కోసమే పార్టీ పెడుతున్నాను అని పవన్ చెప్పారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించి తీరుతామని ప్రజలకు వారు చెప్పినవి చేయాల్సిందే అని గట్టిగా నినదించారు. ఇదంతా సగటు జనం స్వభావం కాబట్టి వారంతా పవన్ కి వెంటనే కనెక్ట్ అయ్యారు.
అలా ఒక కొత్త పార్టీగా జనసేన పుట్టాక దానికంటూ ఒక ప్రత్యేక ఆకర్షణ వచ్చిందంటే ఈ ప్రశ్నించే మనస్తత్వంతోనే అని చెప్పక తప్పదు. అయితే పవన్ 2014 నుంచి 2019 మధ్య టీడీపీ బీజేపీలకు మద్దతు ఇస్తూ మధ్యలో వారి నుంచి వేరు పడి ప్రశ్నించడం కూడా చేశారు.
అలా పవన్ కళ్యాణ్ 2017 తవరువాత ఏపీలో టీడీపీని కేంద్రంలో బీజేపీని గట్టిగానే నిలదీశారు. పాచి పోయిన లడ్డూలు అని ఆనాడు ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన తీరు యువతను ఆకట్టుకుంది. ఏపీలో టీడీపీ పాలన మీద అమరావతి రాజధాని కోసం పెద్ద ఎత్తున సేకరించిన భూముల మీద ఆయన చేసిన విమర్శలు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని ఆకట్టుకున్నాయి.
ఇక 2019 నుంచి 2024 మధ్యలో ఆయన వైసీపీని తూర్పారా పట్టారనే చెప్పాలి. ఎందుకంటే ప్రశ్నించే తత్వంలోని పవర్ ఎంత ఉంటుందో అంతా వైసీపీ కోసం పవన్ వాడేసి ఏపీలో అసలు సిసలు ప్రతిపక్ష నేతగా ప్రజా పక్ష నేతగా ఆవిష్కరించబడ్డారు.
కట్ చేస్తే ఇపుడు ఆయన కూటమి ప్రభుత్వంలో కీలకమైన మిత్రపక్షంగా ఉంటున్నారు. ఈ పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో అనేక విషయాలు జరిగాయి. అయితే మంచి చెడులను నిర్మాణాత్మకంగా సమీక్షించే అవకాశం అధికారం కూటమి మిత్రపషంగా జనసేనకు ఉంటాయి.
కానీ పవన్ మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు అమరావతికి మళ్ళీ 40 వేల ఎకరాల సేకరణ ఎందుకు అన్న విషయంలో ఆయన జనసేన పార్టీగా స్టాండ్ ఏమిటి అన్నది చెప్పలేదనే అంటున్నారు. అలాగే పోలవరం ఎత్తు తగ్గింపు అంశం మీద జరుగుతున్న చర్చలో కానీ అమరావతి రాజధాని కోసం పెద్ద ఎత్తున తెస్తున్న అప్పుల విషయంలో కానీ పవన్ నుంచి ఆశించిన మేరకు స్పందన రాలేదని అంటున్నారు.
కాపు నేత మాజీ మంత్రి చేగొండి హరి రామయ్య జోగయ్య వంటి వారు గోదావరి జిల్లాలకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేసి నంబర్ వన్ గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సరికొత్త రైల్వే లైన్లను వేయడం తో పాటు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కూడా అంటున్నారు.
అయితే కూటమి ప్రభుత్వం అమరావతి మీద ఫోకస్ పెడుతూంటే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి విషయం మీద జనసేన నుంచి ఎందుకు ప్రశ్నలు రావడం లేదు అన్న చర్చ ఉంది. ఇక సూపర్ సిక్స్ హామీల విషయంలో గత పది నెలలలో కూటమి ప్రభుత్వం పెద్దగా చేసింది లేదు అన్న విమర్శలు ఉన్నాయి.
దీని మీద కూడా జనసేన మిత్ర పక్షంగా ప్రశ్నించాల్సి ఉంది కదా అని అంటున్నారు. అలాగే వాలంటీర్లకు పది వేలు ఇస్తామని చెప్పిన మాటలు 30 వేల మందికి పైగా మహిళలు మిస్ అయ్యారని చాలా తీవ్ర స్థాయిలో చేసిన ఆరోపణలకు జవాబులు అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలన్నది కూడా జనసేన మరచిందా అన్న చర్చ సాగుతోంది.
ఒక విధంగా చెప్పాలీ అంటే పవన్ మౌనమే నా భాష అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలని చంద్రబాబు పదిహేనేళ్ళు సీఎం కావాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వంలో ఏమి జరిగినా ప్రశ్న అనే పదునైన ఆయుధం తీయాల్సిన అవసరం లేదనే భావిస్తున్నారు అని అంటున్నారు.
అయితే పవన్ పొలిటికల్ ఇమేజ్ ని నిలువెత్తున నిలబెట్టిందే ప్రశ్నించే తత్వం. మరి ఆయన దానినే ఫణంగా పెట్టి ముందుకు సాగుతామంటే అది సొంత సామాజిక వర్గంతో పాటు సగటు జనంలోనూ అసంతృప్తి రాజేస్తుందని అంటున్నారు. రాజకీయాల్లో ఇమేజ్ అన్నది ప్రధానం. దానిని కాపాడుకోవడం ఇంకా ప్రధానం. అది కనుక ఇబ్బందుల్లో పడితే ఇబ్బందులే వస్తాయని అంటున్నారు. మరి సేనాని ప్రశ్నించే తత్వం కోల్పోతున్నారా అంటే పది నెలల ఆయన అధికార రాజకీయ విధానమే జవాబు అని అంటున్నారు.
