Begin typing your search above and press return to search.

ఢిల్లీలో పవన్.. మాజీ సీఎం జగన్ పై ఎన్నో సెటైర్లు

ఢిల్లీలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాక్రిష్ణణ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లిన పవన్.. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

By:  Tupaki Desk   |   12 Sept 2025 9:45 PM IST
ఢిల్లీలో పవన్.. మాజీ సీఎం జగన్ పై ఎన్నో సెటైర్లు
X

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచు డైలాగులు పేల్చారు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాక్రిష్ణణ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లిన పవన్.. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలిపై చర్చ జరగగా, ఆయనను ఏ మాత్రం లెక్క చేయనట్లు పవన్ తీసిపారేశారు. అంతేకాకుండా జగన్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ క్రమంలో జగన్ పై పలు సెటైర్లు వేశారు పవన్. జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటాన్ని మీడియా ప్రస్తావించగా, ‘‘జగన్, ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్రత్యేక రాజ్యాంగం రాసుకున్నారేమో?’’ అంటూ వ్యాఖ్యానించారు. వారి రాజ్యాంగం భారత రాజ్యాంగం ముందు చెల్లవు కదా? అంటూ కామెంట్ చేశారు.

ఈ సమయంలో పవన్ వ్యంగ్యంగా నవ్వగా అక్కడ ఉన్నవారూ డిప్యూటీ సీఎం చమత్కారంతో నవ్వుకున్నారు. ఎన్నికల ముందు 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని నడిపిన జగన్.. గత ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారని పవన్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్న జగన్.. తనకు 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నట్లు పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక మాజీ సీఎం జగన్, డిప్యూటీ సీఎం పవన్ మధ్య రాజకీయ విమర్శలపై పొలిటికల్ సర్కిల్స్ చాలా ఆసక్తి ప్రదర్శిస్తాయి. ప్రధానంగా తనకు అధికారం దూరమవడానికి జనసేనాని పవన్ కల్యాణ్ కారణమని మాజీ సీఎం జగన్ భావిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీతో పవన్ చేతులు కలపకుండా చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలో కొనసాగనివ్వనని ప్రతిన బూనిన డిప్యూటీ సీఎం పవన్.. టీడీపీ, బీజేపీని కలిపి ఏపీలో పెద్ద కూటమి నిర్మించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కారణమయ్యారు. దీంతో పవన్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ పలు విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.

అయితే అధికారంలోకి వచ్చాక వైసీపీని తేలిగ్గా తీసుకుంటున్న డిప్యూటీ సీఎం.. సమయం చూసుకుని జగన్ పై పంచులు పేల్చుతున్నారు. గతంలో కూడా జగన్ విషయంలో ఓ సారి విలేకరుల ప్రశ్నలకు ఆయన వ్యంగ్యంగా నవ్వడం వైరల్ అయింది. ఇప్పుడు కూడా అదే విధంగా నవ్వుతూ జగన్ పనితీరును విమర్శించడం చూస్తే జగన్ పార్టీని పెద్దగా లెక్కలోకి తీసుకుంటున్నట్లు లేదని అంటున్నారు.