గుజరాతీ వంటకాలు.. పవన్‌కు కొసరికొసరి వడ్డించిన మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశంసలు గుప్పించారు. మోడీ నిజమైన హీరో(ట్రూ హీరో ) అంటూ ఆకాశానికి ఎత్తేశారు.
By: Tupaki Desk | 26 May 2025 9:07 AM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశంసలు గుప్పించారు. మోడీ నిజమైన హీరో(ట్రూ హీరో ) అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఆయన నాయకత్వంలో దేశం పురోభివృద్ధిలో పరుగులు పెడుతోందని చెప్పారు. ''దేశం పట్ల ప్రధాని మోడీ నిజమైన ప్రేమ.. నిబద్ధత వంటివి మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తి నిస్తుంది.'' అని పవన్ పేర్కొన్నారు. తాజాగా ఆదివారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల భేటీలో పవన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు.
చాలా మంది నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చినా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్ కల్యాణ్, మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, శివసేన నేత, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేలతో ఉన్న టేబుల్‌ను ఎంచుకున్నారు. అంతేకా దు.. పవన్‌ను తనకు పక్కగా కూర్చోబెట్టుకున్నా.. కొద్ది నిమిషాల తర్వాత.. మధ్యలో ఏక్‌నాథ్ షిండే వచ్చి కూర్చున్నారు. దీంతో ఆయనకు పక్కగా పవన్ కూర్చున్నారు. ఈ సందర్భంగా సెల్ఫీలకు కూడా ప్రధాని ఫోజులు ఇచ్చారు. అయితే.. చిత్రం ఏంటంటే.. సహజంగా ప్రధాని ఎవరితోనూ కలిసి భోజనం చేయరు. ఒకవేళ చేసినా.. తూతూ మంత్రంగా తిని వెళ్లిపోతారు.
కానీ.. పవన్ కల్యాణ్‌తో కలిసి చేసిన తొలి విందు భోజనంలో ప్రధాని మోడీ.. ఆయనను కుశల ప్రశ్నలు అడిగారు. గొంతు నొప్పి తగ్గిందా? ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? వంటి వివరాలను తెలుసుకున్నారు. అంతేకాదు.. ఈ విందులో ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను వండి వార్చారు. వీటిలో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు చెందిన కొన్ని ప్రత్యేక వంటకాలైన గుజరాతీ ఖడి(దీనిని పెరుగుతో తయారు చేస్తారు), ఢొకియా(బియ్యం, వేరుశనగ పిండితో తయరు చేసే వంటకం)లను వడ్డించారు.
అయితే.. పవన్ వాటిని వడ్డించుకునేందుకు సిగ్గు పడుతుంటే.. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని.. ''బాగుంటుంది.. తినండి!'' అంటూ.. ప్రోత్సహించడంతో పాటు.. ''ఇంకా వడ్డించండి.. ఇంకా వడ్డించండి'' అంటూ సర్వ్ చేసేవారిని ఆదేశించడంతో.. టేబుల్ చుట్టూ ఉన్న ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు విరగబడి నవ్వారు. ప్రధాని ఎవరికీ ఇలా వడ్డించరని.. పవన్ అంటే ఆయనకు అభిమానమని అందుకే కొసరి కొసరి మరీ వడ్డించారని ఈ విషయాన్ని చూసిన వారు వ్యాఖ్యానించారు.
