బుచ్చయ్య చౌదరి మీద పవన్ సంచలన కామెంట్స్
ఇదిలా ఉంటే రాజమండ్రిలో గురువారం జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద సంచలన వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 26 Jun 2025 4:12 PM ISTఏపీ రాజకీయాల్లో సీనియర్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఒక స్టైల్. ఆయన అన్న గారు పార్టీ పెట్టడంతోనే అందులో చేరిన వారు. ఇప్పటికి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన వారు. బుచ్చయ్యచౌదరి రాజకీయ నిబద్ధత నిజాయితీ అన్నవి ఈ తరానికి ఆదర్శమైనవే. ఎనభయేళ్ల వయసులో కూడా చురుకుగా ఉంటూ రాజకీయం చేసే బుచ్చయ్య చౌదరి ప్రస్తుత అసెంబ్లీలో అందరి కంటే వయో వృద్ధుడుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే రాజమండ్రిలో గురువారం జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు ఇష్టమైన రాజకీయ నాయకులలో బుచ్చయ్య చౌదరి ఒకరి అని పవన్ అన్నారు. అంతే కాదు ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూ మనమే తగ్గాలి కానీ బుచ్చయ్య చౌదరి ఏ మాత్రం తగ్గరని అన్నారు.
ఆయన పట్టు విడవని విక్రమార్కుడు అన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని పవన్ అన్నారు. ఆయన తగ్గరు మనమే తగ్గాలి అని పవన్ ఎందుకు అన్నారని అనుకుంటే 2024 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేయాల్సి ఉంది. అయితే బుచ్చయ్యచౌదరి పట్టుబట్టడంతో అక్కడ జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్ నిడదవోలులో పోటీ చేశారు. అలా మంత్రి కూడా అయ్యారు. బహుశా దీనిని దృష్టిలో ఉంచుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ ఉంది.
అయితే పట్టుదలలో బుచ్చయ్యచౌదరిని చూసి చాలా నేర్చుకోవాలని పవన్ అనడం ఆయనకు ప్రశంసగానే చూడాలని అంటున్నారు. ఇక రాజమండ్రి తీరం అనగానే గుర్తుకు వచ్చేది గోదావరి నది, అలాగే అన్నపూర్ణ లాంటి డొక్కా సీతమ్మ తల్లి అని పవన్ అన్నారు. ఎందరో కవులు కళాకారులకు మహానుభావులకు జన్మను ఇచ్చిన నేల అది అని కొనియాడారు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం మీద ఫోకస్ పెట్టిందని అందులో భాగంగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమలు చేస్తున్నామని పవన్ చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మేలు ఎలా జరుగుతుందో ప్రజలకు అర్ధం అవుతోంది అని అన్నారు. ఒక బైక్ కి ఇంజన్ స్పీడ్ గా ఉంటే ఎంత వేగంగా పరుగులు తీస్తుంది అన్నది తెలుసుతుందని అలాంటిది కూటమిది డబుల్ ఇంజన్ సర్కార్ అని పవన్ అన్నారు.
ఎన్నికల్లో టీడీపీ కూటమిని గెలిపించమని తాను కోరాను అని ఆయన అంటూ ప్రజలు కూడా అదే విధంగా ఆలోచించ బట్టి ఈ రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని పవన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోందని పవన్ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగుతోందని, అలాగే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామని చెప్పారు. రాష్ట్ర ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.
