పవన్ సీరియస్ పొలిటీషియన్ కారా ?
మరి ఇంత చేసిన పవన్ ని సీరియస్ పొలిటీషియన్ కారు అని చాలా మంది అంటుంటారు
By: Tupaki Desk | 12 April 2025 10:58 PM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గా ఎదిగిన పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లు అయింది. ఆయన ఒక ఎన్నికల్లో ప్రచారానికే పరిమితం అయ్యారు. రెండు ఎన్నికల్లో పోటీ చేశారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా కుంభ స్థలాన్ని కొట్టినట్లుగా ఉప ముఖ్యమంత్రి సీటులోనే కూర్చున్నారు.
మరి ఇంత చేసిన పవన్ ని సీరియస్ పొలిటీషియన్ కారు అని చాలా మంది అంటుంటారు. రీసెంట్ గా చూస్తే బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఫైర్ బ్రాండ్ అయిన కవిత కూడా అదే మాట అన్నారు. ఆమె ఏపీలోని నాయకులు అందరికీ పొగుడుతూ ఒక్క పవన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన పాలిటిక్స్ లో సీరియస్ నెస్ కనిపించడంలేదని తేల్చేశారు.
ఇంతకీ పవన్ లో సీరియస్ నెస్ లేదా అంటే దానికి అనేక రకాలైన విశ్లేషణలు ఉన్నాయి. రాజకీయాలను వృత్తిగా ఆశగా శ్వాసగా చేసుకున్న వారు కొందరు ఉంటారు. పాలిటిక్స్ ని తన ఊపిరిగా చేసుకున్న వారు బహు కొద్ది మంది ఉంటారు. ఆ కోవలోకి చంద్రబాబు వస్తారు. ఆయనను బోర్న్ పొలిటీషియన్ అని చెప్పాలి. బాబు జీవితంలో అత్యధిక భాగం రాజకీయాల్లో గడచింది.
బాబు ఈ రోజుకీ రాజకీయాన్ని ఒక తనకు అత్యంత ఇష్టమైనదిగా చూస్తారు. ఆయనలో ఆ ఇష్టమే ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొనేలా చేస్తుంది. బాబు పాలిటిక్స్ లో పెట్టిన బెంచ్ మార్క్ ని అందుకోవడం ఎవరి వల్లా కాదు. అలా చూస్తే బాబు కంటే సీరియస్ పొలిటీషియన్ బహుశా దేశంలోనే లేరు అని చెప్పాలి.
ఇక మిగిలిన వారి విషయంలో చూస్తే రాజకీయాన్ని తమ వృత్తిగా లేక తమకు నచ్చిన రంగంగా ఎంచుకున్నా వారు దానికి కేటాయించే సమయం కూడా ఒక లెక్కన ఉంటుంది. ఇరవై నాలుగు గంటలూ రాజకీయానికి కేటాయించేవారు చాలా చాలా తక్కువ. అలా చూస్తే కనుక వారూ సీరియస్ పొలిటీషియన్స్ గానే ఉంటారు.
కానీ వారు రాజకీయానికి ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తారు అయితే వారి ప్రభావం చర్యల ద్వారా కానీ ఇతరత్రా ద్వారా కానీ ఎపుడూ ప్రతిఫలిస్తూ ఉంటుంది కాబట్టి వారిని సీరియస్ పొలిటీషియన్స్ గా చూస్తూంటారు. ఇక రాజకీయాల్లో ఫిలాసఫీని బట్టి కూడా సీరియస్ పొలిటీషియన్ అని నిర్వచిస్తూంటారు.
తనకొక ఫిలాసఫీ ఉండి దానినే కంటిన్యూ చేసేవారికి సీరియస్ గానే పాలిటిక్స్ చేస్తున్నారు అని అంటారు. ఇలా రాజకీయాల్లో ఎన్నో చెప్పుకోవచ్చు. మరి పవన్ దగ్గరకు వచ్చేసరికి ఏమి జరుగుతోంది అన్నది చూస్తే కనుక ఆయన నిజానికి సీరియస్ పొలిటీషియన్ కాదు అన్న వారి మాటల కంటే కూడా ఆయన సగటు రాజకీయ నాయకుడు కాడు అనడం సబబేమో.
ఎందుకంటే పవన్ రొటీన్ పొలిటీషియన్ కాదు. ఆయన జనంలో నుంచి ఆలోచిస్తారు. జనం మాటలనే చెబుతారు. ఆయన నిన్న ఒక మాట నేడు ఒక మాట చెబుతారు అని అంటారు. కానీ అవి ఆయా సందర్భాలను బట్టి ఆయన చెప్పినవే అని కూడా భావించాల్సి ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా తనకు తోచింది ఓపెన్ గా చెప్పేయడం సీరియస్ పాలిటిక్స్ కాదు అనుకుంటే పవన్ కూడా కాదు.
కానీ పవన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా రాజకీయం చేస్తారు అని భావిస్తే మాత్రం అందులో ఆయన సీరియస్ నెస్ ని చూడవచ్చు. కానీ ఈ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అలా వాస్తవంగా మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టే వారు అరుదుగా రాజకీయాల్లో ఉంటారు.
ఈ కారణం చేతనే పవన్ రాజకీయం ప్రత్యర్ధులకు తేలికగా కనిపించవచ్చు. అయినా రాజకీయం ఇలాగే చేయాలని లేదు. ప్రజా సేవకు అది ఒక మార్గం. ప్రజల భాషలో మాట్లాడుతూ వారికి కనెక్ట్ అయ్యేలా వ్యవహరించే రాజకీయం ఏదైనా సీరియస్ గానే చూడాలి. ఆ నిర్వచనమే పవన్ కి అప్లై చేస్తే కనుక ఆయన రాజకీయం సీరియస్ గానే చేస్తున్నట్లుగా చెప్పాలి.
పవన్ అలా మనసులో ఏదీ పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే రాజకీయ నాయకుడు. ఆయనది సీరియస్ పాలిటిక్స్ కాదు అనుకున్నా పోయేది ఏమీ లేదు. ఏదీ ఇలాగే చేయాలని లేనపుడు పవన్ మార్క్ పాలిటిక్స్ ఇదే అని అనుకుంటే పోతుంది. ఇక ప్రత్యర్ధులు చేసే విమర్శలకు జవాబు చెప్పడమూ ఎవరి వల్లా కాదు కాబట్టి దాని గురించి తర్కించుకోవడమూ వ్యర్ధ పురాణమే అవుతుంది.
