సొంత ఇలాకాలో మెరవనున్న పవన్ !
ఇప్పుడు తిరిగి ఆయన అధికారిక పర్యటనలు చేపడుతున్నారు. ముందుగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ రెండు రోజుల పర్యటనను పెట్టుకున్నారు.
By: Satya P | 18 Sept 2026 12:35 PM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపు నెల రోజుల తరువాత తిరిగి అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆయన ప్రకృతి వైద్యం కోసం గత నెలలో కేరళం వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ ఉండగానే రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఘనంగా పవన్ పుట్టిన రోజు వేడుకలు కూడా జరిగిపోయాయి. ఇక పవన్ ఎక్కువ రోజుల పాటు కేరళంలోనే గడిపారు. ఆయన పూర్తి స్వస్థత చేకూరిన తరువాత కేరళంలోని ఆలయాలను కూడా దర్శించుకుని ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకున్నారు. ఇప్పుడు తిరిగి ఆయన అధికారిక పర్యటనలు చేపడుతున్నారు. ముందుగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ రెండు రోజుల పర్యటనను పెట్టుకున్నారు.
బహిరంగ సభతోనే :
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 21, 22 తేదీలలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పవన్ బహిరంగ సభలో మాట్లాడి దాదాపుగా యాభై రోజుల పై దాటింది. ఆగస్టు 1న ఆయన విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రసంగించారు. తిరిగి ఇపుడు పిఠాపురం బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు.
బిజీ షెడ్యూల్ గా :
చాలా కాలానికి పవన్ సభ కాబట్టి దానికి తగినట్లుగా పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ గ్రౌండ్ లో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పిఠాపురం పర్యటనలో భాగంగా పవన్ పెద్ద కొండెవరం రథాల పేట అంబేద్కర్ కాలనీ అగ్రహారం గ్రామాలను సందర్శించనున్నారు. అలాగే పాడా కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారని తెలుస్తోంది.
చూడాలని ఆసక్తి :
ఇక పోతే పవన్ కళ్యాణ్ చాలా కాలానికి జనంలోకి వస్తున్నారు. ఆయన ఆ మధ్య కాలమంతా ఆరోగ్యం సహకరించక ఎక్కడికీ వెళ్లలేకపోయారు. దాంతో పవన్ నేరుగా పిఠాపురమే రావడంతో ఆయనను చూసేందుకు ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతే కాదు జనసేన కార్యకర్తలు కూడా పవన్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్రంలో చూస్తే పవన్ మాట ఊసూ లేని రాజకీయమే చాన్నాళ్ళుగా సాగుతోంది. ఇపుడు స్థానిక ఎన్నికల వేడి కూడా రాజుకున్న వేళ పిఠాపురం సభ నుంచి పవన్ ఏ విధమైన సందేశం ఇస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది.
వరుస సమావేశాలు :
మొత్తానికి పవన్ పర్యటన అయితే ఆసక్తిని కలిగిస్తోంది. పిఠాపురం పర్యటన తరువాత ఆయన అధికార కార్యక్రమాలలో మరింత బిజీ అవుతారు అని అంటున్నారు. అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో పార్టీ నేతలతో కూడా వరుస సమావేశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నెల నాలుగో వారంలో కూటమి సీట్ల సర్దుబాటు మీద చర్చలు కూడా జరిగే వీలుంది అని అంటున్నారు.
