ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. మధ్యలో పవన్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 4:30 PMడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ నియోజకవర్గానికి చెందిన చిరకాల ప్రత్యర్థుల మధ్య కొత్తగా చిగురిస్తున్న స్నేహం టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అవుతోంది. పొలిటికల్ గా తమ పరిస్థితిపై అంతగా సంతృప్తిగా లేరని ప్రచారం జరుగుతున్నా.. ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ మాటే వేద వాక్కుగా సాగిపోతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో పవన్ మాటే శాసనం అన్నట్లు సాగిపోతోంది. అయితే ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాత్రం పరిస్థితులు అంత సాఫీగా లేవని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురం జనసేనాని గెలుపు వెనుక తమ శ్రమ ఉందని ఎవరైనా అనుకుంటే అది వారు ఖర్మ అంటూ మెగా బ్రదర్ నాగబాబు లేపిన దుమారంతో ఆ నియోజకవర్గంలో ఏదో జరుగుతోందనే అనుమానాలే ఎక్కువగా వ్యాపించాయి. అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ తన పర్యటనతో ఆల్ హ్యాపీస్ అని చాటిచెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
పిఠాపురం నియోజకవర్గం వరకు కూటమి పార్టీల్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో ఉండగా, మరొకరు టీడీపీ సీనియర్ నేత వర్మ. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నించిన వర్మ.. జనసేనాని పవన్ కోసం సీటు త్యాగం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పవన్ గెలుపును తన భుజస్కాంధాలపై వేసుకుని ప్రచారం చేసిన వర్మకు నామినేటెడ్ పదవి ఇస్తామని కూటమి పెద్దలు హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది కావస్తున్నా, టీడీపీ నేత వర్మకు పదవి అందని ద్రాక్షలానే మిగిలింది. ఇదే సమయంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెం దొరబాబు కూడా ఎన్నికల సమయంలో పూర్తిగా సైలెంట్ అయి పవన్ గెలుపునకు పనిచేశారంటున్నారు. దీంతోనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు జనసేనలోకి తీసుకున్నారు.
టీడీపీ అధిష్ఠానం హామీతో వర్మ.. వైసీపీ అధిష్ఠానంపై అసమ్మతితో దొరబాబు కలిసి పిఠాపురంలో జనసేనాని పవన్ ను గెలిపించారనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ విషయంలో గత కొంతకాలంగా జనసేనలోని కొందరు నేతలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటమే కాకుండా, ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను అవమానాలకు గురిచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో వారి అభిమానులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల వర్మ, దొరబాబు అనుచరులతో జనసైనికులు వీధి పోరాటాలకు దిగడం కూడా పరిస్థితిని దిగజార్చుతోందని అంటున్నారు. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో పిఠాపురంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయంటున్నారు.
ఎవరు ఎమన్నా.. మీకు నేనున్నా.. అంటూ పవన్ హామీ ఇవ్వడంతో జనసైనికులు రెచ్చగొడుతున్నా, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు ఎక్కడా పెదవి విప్పడం లేదంటున్నారు. అందుకే సాధారణంగా పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, పవన్ వస్తున్నారంటే ఆ ఇద్దరూ ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు. దీనికి తాజాగా పవన్ పర్యటననే ఉదహరిస్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నా, పవన్ పర్యటనలో ఆ ఇద్దరు కుడి, ఎడం భుజాలుగా కూర్చోవడంతో విమర్శకుల నోళ్లకు తాళం వేశారంటున్నారు. పవన్ రాజకీయ చాణక్యంతో సీనియర్లను అసంతృప్తికి లోనుకాకుండా చూసుకుంటూ పిఠాపురంలో తన మార్కు రాజకీయం ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు.