అన్నా.. నువ్వు పీపుల్ స్టార్.. పవర్ స్టార్ పై మంత్రి లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పీపుల్ స్టార్ అంటూ కొత్త బిరుదు అంకితం చేశారు మంత్రి లోకేశ్.
By: Tupaki Desk | 2 Sept 2025 3:20 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పీపుల్ స్టార్ అంటూ కొత్త బిరుదు అంకితం చేశారు మంత్రి లోకేశ్. డిప్యూటీ సీఎం పవన్ పుట్టిన రోజు సందర్భంగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు లోకేశ్. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను పీపుల్ స్టార్ గా లోకేశ్ అభివర్ణించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘‘వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన లోకేశ్.. తన ట్వీట్ లో పవన్ ను తన అన్నగా మారోమారు ప్రస్తావించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ట్వీట్ పవన్, లోకేశ్ మధ్య సంబంధాలను మరింత బలపరిచిందని, ఇద్దరి మధ్య అనుబంధం ఎంతలా గట్టి పడుతుందో ఈ ట్వీట్ ద్వారా అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో సాధించిన విజయంలో పవన్ పాత్రను వంద శాతం ఆమోదించేలా లోకేశ్ ట్వీట్ చేశారని అంటున్నారు. పవర్ స్టార్ ను పీపుల్ స్టార్ గా అభివర్ణించడం ఇందులో భాగమే అంటున్నారు. అంతేకాకుండా తనను సొంత అన్నదమ్ముడి పరిగణించడంపైనా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల ముందు నుంచి పవన్, లోకేశ్ మధ్య అనుబంధం కొనసాగుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రభుత్వంలో జనసేనాని ప్రభావం తగ్గించేలా టీడీపీ వ్యవహరిస్తుందని వారి రాజకీయ ప్రత్యర్థులు ఆశించారు. ఈ ఇద్దరి మధ్య బంధాన్ని దూరం చేస్తే తమకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని, ఆ ఇద్దరిని రెచ్చగొట్టేలా వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారు. కానీ, పవన్, లోకేశ్ 15 నెలలుగా కలిసిమెలిసి వ్యవహరిస్తున్నారు. కొన్ని విషయాల్లో పవన్ ప్రాధాన్యం పెంచుతూ తాను ఒక అడుగు తగ్గి రాజకీయంగా లోకేశ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
