జమిలి మీద పవర్ ఫుల్ స్లోగన్ తో పవన్!
జమిలి ఎన్నికలు మీద దేశంలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. అది ఎలాంటిది అంటే తమకేదో నష్టం కష్టం వస్తుందని ప్రాంతీయ పార్టీల అధినేతలు అంటున్నారు.
By: Tupaki Desk | 27 May 2025 3:33 PM ISTజమిలి ఎన్నికలు మీద దేశంలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. అది ఎలాంటిది అంటే తమకేదో నష్టం కష్టం వస్తుందని ప్రాంతీయ పార్టీల అధినేతలు అంటున్నారు. జాతీయ ప్రభావం స్థానికంగా పడి అందులో తాము కొట్టుకుని పోతామని చెబుతున్నారు. అయితే దేశంలో జమిలి ఎన్నికలు కొత్త కాదు, 1952 నుంచి 1967 దాకా దేశంలో జరిగినవే. అయితే ఆ జమిలి గొలుసుకట్టు ఆ తరువాత తెగిపోయింది.
దాంతో పాటు దేశంలో అనేక కొత్త పార్టీలు పుట్టుకుని వచ్చాయి. ఇక రాజకీయం చాలా మారిపోయింది. దాంతో ఎన్నికలు ఉప ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఇలా అనేకమైనవి వస్తున్నాయి. దాంతో దేశంలో జమిలి ఎన్నికలు రావాలని మేధావులు అంటున్నారు. అంతే కాదు అయిదేళ్ళ పాటు ఒక ప్రభుత్వం పాలన చేయాలంటే మధ్యలో వచ్చే ఎన్నికలు వచ్చి పడుతూంటే ఎలా సాధ్యమని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఒక ప్రభుత్వానికి అయిదేళ్ళకు గానూ 1825 రోజులు ప్రజలు ఇస్తూంటే అందులో ఏకంగా 800 రోజులు పూర్తిగా ఎన్నికలకే పోతున్నాయని అంటున్నారు. ఇదే విషయం పూసగుచ్చినట్లుగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన తాజాగా చెన్నైలో జరిగిన ఒకే దేశం ఒకే ఎన్నిక సెమినార్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల వల్ల ఆర్ధికంగా వ్యవస్థ గాడిలో పడుతుందని అభివృద్ధి సాధ్యమని కూడా చెప్పారు.
గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 15.9 బిలియన్ డార్లు ఖర్చు అయితే అదే ఏడాది దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికలకు ఏకంగా 16.3 బిలియన్ డాలర్లు ఖర్చు అయిందని వివరించారు. ఇక దేశంలో అనేక రాష్ట్రాలలో ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఇలా చూసుకుంటూ పోతే వాటికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పనలవి కాదు ఎన్నికల పేరుతో అమలు చేసే కోడ్ వల్ల పాలన కుంటుపడుతుంది. అభివృద్ధి ఫలాలు జనాలకు చేరవు.
ఈ విషయాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ గా సెమినార్ లోనూ అలాగే మీడియా మీటింగులోనూ వివరించారు. అంతే కాదు ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్ నే సూటింగా ప్రశ్నించారు. 2021లో అధికారంలోకి వచ్చీ స్టాలిన్ ప్రభుత్వం 2022లో స్థానిక ఎన్నికలు, 2024లో లోక్ సభ ఎన్నికలతో ఎంత సమయం ఎంత ఖర్చుని ఎదుర్కొందో అని కూడా గుర్తు చేశారు అంతే కాదు స్టాలిన్ తండ్రి అయిన మాజీ సీఎం కరుణానిధి జమిలి ఎన్నికలను సపోర్టు చేశారు అని గుర్తు చేశారు. తండ్రి బాటలో స్టాలిన్ నడవాలని ఆయన సూచించారు.
అంతే కాదు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న దేశంలోని పార్టీలు కలసి కూర్చుని చర్చించి పరిష్కారలాను కనుగొనాలని ఆయన కోరారు. అస్తమానూ ఎన్నికలు అంటే పాలన పక్క దారి పడుతుందని పవన్ వివరించారు. పాలకులు ఎవరూ ప్రజా పాలన మీద దృష్టి కనీస మాత్రంగా పెట్టలేరని అన్నారు. ఈ తరహా వ్యవస్థలతో అంతా విసిగిపోయారని కూడా పవన్ అన్నారు.
దేశంలో ప్రతీ ఏడాది ఎక్కడో ఒక చోట ఎన్నికలు అంటే ఆర్ధికంగా పెను భారంగా మారాయని పవన్ చెప్పుకొచ్చారు. జమిలి ఎన్నికలను వ్యతిరేకించడం కంటే వాటి మీద సరైన సలహా సూచనలు ఇవ్వడం మేలు అని పవన్ కళ్యాణ్ విపక్షాలకు సూచించారు.
జమిలి ఎన్నికల మీద పవన్ చెప్పిన స్థాయిలో ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదని భావించాలి. ఆయన చాలా విడమరచి చెప్పారు. అంతే కాదు జమిలి ఎన్నికలను వద్దు అనకుండా విపక్షాలు పరిష్కారాలు చెప్పాలని కోరడం మంచి పరిణామంగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే ఈవీఎంల విషయంలో కూడా ఆయన సెటైర్లు వేశారు. తాము గెలిస్తే సూపర్ అంటారు, ఓడితే ట్యాంపరింగ్ అంటారని ఆయన అన్నారు. ఇది మంచి విధానం కాదని పవన్ చురకలు అంటించారు.
సనాతన ధర్మం భారత్ పాటిస్తుందని పవన్ చెప్పడం కూడా మరో విశేషంగా చూడాలి అసలు భారత్ గడ్డ సనాతన ధర్మానిది అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. హిందువుల మీద దాడులు చేస్తూన్నా మాట్లాడవద్దా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
ఎవరూ కూడా ఇతర మతాల మీద ఆధిపత్యం చలాయించవద్దు అని కచ్చితంగా చెప్పేశారు. నిజానికి ఈ తరహా మాటలు అన్నీ బీజేపీవే. కానీ వారు చెబితే అదోలా ఉండే ఈ వ్యాఖ్యలు పవన్ చెప్పడంతో అవును నిజమే కదా అని అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అందుకేనేమో పవన్ కళ్యాణ్ ని ఈ తరహా అంశాల మీద జనానికి చెప్పేందుకు బీజేపీ ముందుంచుతోంది అని అంటున్నారు. దానికి తగ్గట్లుగా పవన్ తన పవర్ ఫుల్ స్లోగన్ తో జనంలోకి వెళ్తున్నారు. అది పెద్ద చర్చగా మారి సానుకూల స్పందన కీలక అంశాలలో వస్తోంది అని అంటున్నారు.
