Begin typing your search above and press return to search.

నేను, చంద్రబాబు ఏం చేయలేం.. కాలుష్యంపై పవన్ కీలక వ్యాఖ్యలు..

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని చెప్పిన డిప్యూటీ సీఎం.. పర్యావరణ శాఖ పర్యవేక్షిస్తున్న తాను ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు.

By:  Tupaki Desk   |   19 Sept 2025 5:13 PM IST
నేను, చంద్రబాబు ఏం చేయలేం.. కాలుష్యంపై పవన్ కీలక వ్యాఖ్యలు..
X

ఏపీ అసెంబ్లీలో పర్యావరణ కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభ్యురాలు ఎంతో బాధ్యతగా అడిగిన ప్రశ్నకు తన గుండె లోతుల్లో ఉన్న ఆవేదనతో సమాధానం చెబుతున్నట్లుగా పవన్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్లాస్టిక్ ను ఎక్కడిపడితే అక్కడ వేసేస్తున్నారని, అందువల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని డిప్యూటీ సీఎం ఆందోళన వెలిబుచ్చారు. ప్రజలు ఎక్కడిపడితే అక్కడ ప్లాస్టిక్ వదిలేస్తే తాను గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ రోజూ వెళ్లి ప్లాస్టిక్ ఏరలేం కదా? అంటూ నిస్సహాయత వ్యక్తంచేశారు.

ప్లాస్టిక్ కాలుష్యం నివారణకు ప్రభుత్వం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నా, ఆ సమస్య తీవ్రత తగ్గడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్ యూజుడ్ ప్లాస్టిక్ ను నిషేధించామని, బయోడీగ్రేడ్బుల్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్లాస్టిక్ భూమిలో అంత తేలికగా కలిసిపోదని, కనీసం 300 నుంచి 500 ఏళ్లు పడుతోందని చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్ ఎక్కడికక్కడ పడేయడం వల్ల పశువులు తినేస్తున్నాయని, వాటిరక్తంలో ప్లాస్టిక్ కలిసిపోతోందని, వాటి పాలను తాగి మన పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని డిప్యూటీ సీఎం వివరించారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం వల్ల కేన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని చెప్పిన డిప్యూటీ సీఎం.. పర్యావరణ శాఖ పర్యవేక్షిస్తున్న తాను ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాలను వాడాలని సూచిస్తున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా వినియోగించుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సింగిల్ యూజుడ్ ప్లాస్టిక్ బదులుగా బయోడీగ్రేడ్బుల్ ప్లాస్టిక్ వాడాలని ప్రభుత్వం సూచిస్తోందని చెప్పారు.

కాలుష్య నియంత్రణకు పౌరుల బలమైన భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉందని పవన్ హితవు పలికారు. ప్రస్తుతం పెరిగిపోయిన ప్లెక్సీల కల్చర్ కూడా పర్యావరణాన్ని నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పర్యావరణ పరిరక్షణకు త్వరలో ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రానుందని వెల్లడించారు. ప్లాస్టిక్ నిరోధించాలంటే ముందుగా మూలాలపై ద్రుష్టి పెట్టాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ నివారించేందుకు ప్రయత్నించిందని పవన్ వెల్లడించారు. తమ ప్రభుత్వం స్వచ్ఛరథం పేరుతో ప్లాస్టిక్ సేకరించాలని నిర్ణయించిందని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ప్రజాప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు.