ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ రాజీనామాపై పవన్ సెన్సేషన్ ట్వీట్..
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 22 July 2025 12:34 PM ISTఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో ఉప రాష్ట్రపతి తన పదవి నుంచి దిగిపోయారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ స్పందించడం ఆసక్తి రేపుతోంది. ఉప రాష్ట్రపతి ఆకస్మిక రాజీనామాతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు ఆత్మరక్షణలో పడిపోయారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ ట్వీట్ చేయడంపై చర్చ జరుగుతోంది. ధన్ ఖడ్ ఉప రాష్ట్రపతిగా ఉండగా, ఏ నాడు ఆయనను కలుసుకోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇప్పుడు ధన్ ఖడ్ రాజీనామా తర్వాత స్పందిస్తూ ఆయన పనితీరుపై పొగడ్తలు కురిపించడంపైనా చర్చ జరుగుతోంది.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాజ్యసభను నడిపిన ఆయన సాయంత్రం ఆకస్మాత్తుగా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా తన రాజీనామాకు అనారోగ్య కారణాలే కారణమని వివరించారు. అయితే ఉదయం నుంచి సభ కార్యక్రమాల్లో తలమునకలైన ఉప రాష్ట్రపతి సాయంత్రానికి రాజీనామా చేయడంపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఆయన రాజీనామాకు రాజకీయ కారణాలు ప్రధానమన్న టాక్ వినిపిస్తోంది. ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ రాజ్యసభలో వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆయన విపక్షాలను అణచివేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ సేవలపై అధికార పార్టీ నేతలు ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ, కేంద్రంలోని ఎన్డీఏ కీలక భాగస్వామి పవన్ కల్యాణ్ మాత్రం స్పందించడం ఆసక్తి రేపుతోంది.
‘‘భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ జీ మీరు దేశానికి అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు ధన్యవాదాలు’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా పదవీకాలం అంతా ఉప రాష్ట్రపతి కార్యాలయ గౌరవాన్ని అచంచలమైన నిబద్ధతతో నిలబెట్టారని ధన్ ఖడ్ ను కొనియాడారు పవన్. రాజ్యాంగ విలువలను కాపాడారని, దయ, నిష్పాక్షికత, సమగ్రతతో పనిచేశారంటూ అభినందించారు. రాజకీయ ఒత్తడి లేకుండా మీ నిర్భయమైన అభిప్రాయాల వ్యక్తీకరణ ప్రజాజీవితానికి ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశించిందంటూ ధన్ ఖడ్ ను ఆకాశానికెత్తేశారు. పదవీ విరమణ తర్వాత ఆయురారోగ్యాలు, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. అయితే పవన్ ట్వీట్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రాజకీయ కారణాలతో జగదీప్ ధన్ ఖడ్ పదవి నుంచి తప్పుకున్నారనే ప్రచారం నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరూ ఈ పరిణామంపై మాట్లాడలేదని చెబుతున్నారు. కానీ పవన్ ధైర్యంగా ట్వీట్ చేయడం విశేషంగా చెబుతున్నారు. ఇక ధన్ ఖడ్ ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పవన్ ఆయనను కలిసే సందర్భం ఎప్పుడూ రాలేదు. దీనికి కారణం పవన్ పార్టీ జనసేనకు రాజ్యసభ సభ్యత్వం లేకపోవడమే అంటున్నారు. కానీ, ధన్ ఖడ్ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టక ముందు బీజేపీలో పనిచేసిన కాలంలో పవన్ తో మంచి సంబంధాలే ఉండేవని అంటున్నారు. ఈ ఇద్దరు పలు దఫాలు చర్చించారని జనసేన చెబుతోంది.
