పవన్ నాదెండ్ల మధ్య గ్యాప్ నిజమేనా ?
ఏ పార్టీలోనైనా నంబర్ వన్ నంబర్ టూలే కీలకం. వారిద్దరి మధ్యనే ఎపుడూ సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది.
By: Tupaki Desk | 17 April 2025 10:14 AM ISTఏ పార్టీలోనైనా నంబర్ వన్ నంబర్ టూలే కీలకం. వారిద్దరి మధ్యనే ఎపుడూ సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ఇద్దరి మధ్యనే వస్తాయి. ఎంతలా కలసిమెలసి ఉన్నా రాజకీయం ఇది ఇది నిరంతం సాగే నది లాంటిది. ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూటికి నూరు శాతం అగ్ర నాయకులు ఇద్దరూ ఒకే అభిప్రాయంగా వచ్చే అవకాశాలు లేవు
అయితే వాటి మీద సర్దుకుపోతే ఏ వివాదమూ లేదు. కాదు అనుకుంటేనే గోరంతలు కొండంతలు అవుతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ బయట కానీ జరుగుతున్న ప్రచారం కానీ పుకార్లుగా షికారు చేస్తున్న విషయాలు కానీ చూస్తే అవునా నిజమేనా అని అంతా అనుకునే విధంగా చర్చ అయితే ఉంది.
జనసేనలో పవన్ నాయకుడు అయితే నాదెండ్ల మనోహర్ డిప్యూటీగా ఉన్నారు. ఈ ఇద్దరి అనుబంధం చాలా గొప్పది. అన్నదమ్ముల మాదిరిగా ఇద్దరూ ఉంటారు. పార్టీ కష్టకాలంలో చేరారు నాదెండ్ల మనోహర్. ఆయన జనసేనకు ఒక రూపం ఇవ్వడంలో తన వంతుగా పాటుపడ్డారు అని కూడా చెబుతారు.
దాదాపుగా పాతికేళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉన్న వారు నాదెండ్ల మనోహర్. ఉమ్మడి ఏపీలో రెండు సార్లు గెలిచి ఉప సభాపతి, సభాపతి పదవులను సమర్ధంగా నిర్వహించిన వారు ఆయన. అటువంటి నాదెండ్ల 2014లో కాంగ్రెస్ విభజన చేశాక ఏపీలో ఏమీ కాకుండా పోతే తన భవిష్యత్తు రాజకీయాన్ని ఏ టీడీపీలోనో వైసీపీలోనో చూసుకోలేదు.
ఆయన జనసేనను నమ్మారు. అలా జనసేనలో చేరి తన వంతుగా పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. 2019లో జనసేన ఓటమి చవిచూశాక ఆ పార్టీ నుంచి చాలా మంది బయటకు వెళ్ళిపోతే నాదెండ్ల కనిపెట్టుకుని ఉన్నారని కూడా అంతా గుర్తు చేస్తారు. పవన్ ఆలోచనలు ఎత్తులు వ్యూహాల వెనక ఆయన కూడా ఉన్నారని చెబుతారు. ఈ ఇద్దరూ కలసి 2024లో జనసేనను అధికార కూటమిలోకి భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు అన్నది వాస్తవం.
అటువంటి నాదెండ్ల మనోహర్ కి పవన్ కి మధ్యలో ఇపుడు ఏదో గ్యాప్ ఉందని అంటున్నారు అది నిజంగా నిజమేనా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. అయితే జనసేన అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరికలు పెరిగాయి. మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు జనసేనలోకి వస్తున్నారు వారిలో బిగ్ షాట్స్ కూడా ఉంటున్నారు.
అలా వస్తున్న వారిని అందరినీ తీసుకోవాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే వచ్చిన వారిని అందరినీ తీసుకుంటే జనసేన ఇబ్బందులో పడుతుందని మళ్ళీ కొత్త సీసాలో పాత సారాగా వ్యవహారం ఉంటుందని నాదెండ్ల వీటి మీద విభేదిస్తున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఒక వైసీపీ బిగ్ షాట్ జనసేనలోకి చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.
ఆయనకు జగన్ అన్ని విధాలుగా పదవులు ఇచ్చినా ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం జనసేనను ఆశ్రయిస్తున్నారు అని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కాపు నాయకుడు జనసేనలోకి చేరేందుకు రెడీ అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరి నాయకుల చేరిక మీద నాదెండ్ల తన అభ్యంతరాలను తెలియ చేసారు అని అంటున్నారు.
అయితే పార్టీ ఎదగాలీ అన్నా వైసీపీ దెబ్బ తినాలీ అన్నా ఈ రకంగా నాయకులను చేర్చుకోవడంలో తప్పు లేదని జనసేన అధినాయకుడు భావిస్తున్నారు అని అంటున్నారు. ఇలా తామరతంపరగా నాయకులు వచ్చి చేరితే పార్టీ పునరావాస కేంద్రంగా మారుతుందని నాదెండ్ల అంటున్నారని ప్రచారం సాగుతోంది.
మొత్తానికి చూస్తే ఈ విషయంలోనే ఇద్దరు అగ్ర నేతల మధ్య విభేదాలు వచ్చాయని చెబుతున్నారు. దానికి తోడు నాగబాబు ఎమ్మెల్సీ కావడం ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగడంతో కూడా జనసేనలో కొత్త రాజకీయాన్ని సృష్టిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పుకార్లుగా వినవస్తున్న ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ ఇద్దరు నేతల మధ్య సరిగ్గా మాటలు కూడా లేవని అంటున్నారు. రాజకీయాల్లో ఏమి జరిగినా ఆలస్యంగా అయినా విషయం బయటకు వస్తుంది. సో జనసేనలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
