తమిళ ఎఫెక్ట్... పవన్ కి వరస కౌంటర్లు
దాంతో అసలే ఆధ్యాత్మిక ఆలయాల నిలయంగా ఉన్న తమిళనాడులో అతి పెద్ద చర్చగా ఇది మారుతోంది. ఇక రాజకీయ వర్గాలలో కూడా ప్రకంపనలు చెలరేగుతున్నాయి.
By: Tupaki Desk | 25 Jun 2025 6:57 PM ISTతమిళనాడు మధురైలో తాజాగా నిర్వహించిన మురుగన్ మహా భక్తి సమ్మేళనానికి జనసేన అధినేత హోదాలో కాకుండా మురుగన్ భక్తుడిగా కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయన ఆ సభలో చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేశాయి. సూడో సెక్యులరిస్టులు అన్న ఆయన విమర్శలు నిజంగా తగలాల్సిన వారికి తగిలాయి.
ఇంతకీ పవన్ ఏమన్నారు ఆయన మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు అన్నది కనుక ఆలోచిస్తే చాలా విషయాలే తోస్తాయి. వేరే మతాల వారు తమ దేవుడిని ఆరాధించుకుంటే లేని ఇబ్బంది హిందువులు తమ దేవీ దేవతలను ఆరాధిస్తేనే ఎందుకు వస్తుంది అన్నది పవన్ సూటి ప్రశ్న. హిందువుల మీదనే ఎందుకు ఆంక్షలు వారి మీదనే ఎందుకు విమర్శలు అన్నది కూడా ఆయన నిలదీశారు.
సూడో సెక్యులరిస్టులతోనే ఇదంతా వస్తోంది అని కూడా ఆయన అన్నారు. అంతే కాదు సనాతన ధర్మం గొప్పతనం గురించి కూడా ఆయన విడమరచి చెప్పారు. బీజేపీ తప్ప మరో పార్టీకి చెందిన నాయకుడు ఎపుడూ ఇంతలా చెప్పి ఉండలేదు. అంతే కాదు పవన్ లాంటి చరిష్మాటిక్ లీడర్ నోటి వెంట సనాతన ధర్మం పరిరక్షణ గురించి వస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అందుకే ప్రత్యర్ధులు భయపడుతున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఆస్తికత్వం మీద పవన్ మాట్లాడుతూంటే నాస్తికత్వం మీద మక్కువ పెంచుకున్న వారికి ఆగ్రహం వస్తోంది అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే మధురైలో బ్రహ్మాండంగా జరిగిన మురుగన్ భక్తి సమ్మేళనం లో పవన్ ఫుల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఆయన స్పీచ్ కి మంచి స్పందన లభించింది. అంతే కాదు ఆయన ఏ ఆధ్యాత్మికవేత్తకు తీసిపోని విధంగా అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు.
దాంతో అసలే ఆధ్యాత్మిక ఆలయాల నిలయంగా ఉన్న తమిళనాడులో అతి పెద్ద చర్చగా ఇది మారుతోంది. ఇక రాజకీయ వర్గాలలో కూడా ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఎపుడూ హిందూత్వం సనాతన ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తే దాని ప్రభావం పెద్దగా ఉండదు. పవన్ లాంటి నాయకుడి నోట ఈ మాటలు రావడంతోనే తమిళనాడు రాజకీయమే కాదు నాస్తికవాదాన్ని నిండా నింపుకున్న వారు సైతం కలవరపడే పరిస్థితి ఏర్పడుతోంది.
మరో వైపు చూస్తే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే అయితే పవన్ మీద నిప్పులు చెరుగుతోంది. ఆయన ఎవరు తమను ప్రశ్నించడానికి అని కూడా ఫైర్ అవుతోంది. ఇపుడు డీఎంకేకు మద్దతుగా తమిళ సినీ నటుడు సత్యరాజ్ సీన్ లోకి వచ్చారు. ఆయన ఏకంగా పవన్ కే హెచ్చరికలు జారీ చేస్తునారు.
దేవుడు పేరుతో రాజకీయాలు చూస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల పంట పండించుకుందామంటే కుదిరేది కాదని తమిళ గడ్డ మీద అసలు కుదరదని ఆయన చెప్పడం విశేషం. ఇక పవన్ మురుగన్ భక్తి సమ్మేళనన్ లో నాస్తికులపైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదు, కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే నాస్తికులు హిందువులను ఎంచుకుని లక్ష్యంగా చేసుకుంటున్నారు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
దాంతో పవన్ మీద వరస కౌంటర్లు వేస్తున్నారు. నిజం చెప్పాలంటే పవన్ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సత్యరాజ్ సీన్ లోకి వచ్చారు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళనాడు ప్రజలకు మీరు మోసం చేయలేరు అని పవన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మురుగన్ సభతో మోసం చేశామని అనుకుంటే అది మీ తెలివి తక్కువతనం అవుతుందని కూడా ఆయన అన్నారు.
తమిళనాడు ప్రజలు చాలా తెలివైన వారు అని దేవుడి పేరుతో చేసిన వ్యాఖ్యలను తమిళ ప్రజలను తిప్పికొడతారని ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో పవన్ ఎఫెక్ట్ బలంగానే ఉందని అంటున్నారు. జస్ట్ పవన్ ఇంట్రడక్షన్ సీనే ఇలా ఉంటే రానున్న రోజులలో పవన్ తమిళనాడులో విస్తృతంగా పర్యటిస్తే ఎలా ఉంటుందో అన్న చర్చ మొదలైంది.
