కట్టు-బొట్టు-మాట.. పూర్తి తమిళియన్‌గా మారిపోయిన పవన్!
తాజాగా తమిళనాడులోని మదురైలో ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మురుగన్ మానాడుకు ప్రత్యేక అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్.. తమిళుల మనసు దోచుకున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 12:52 PM ISTప్రాంతాన్ని బట్టి ఆహారం, ఆహార్యం ఉండాలని అంటారు పెద్దలు. అచ్చంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మారిపోయా రు. తాజాగా తమిళనాడులోని మదురైలో ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మురుగన్ మానాడుకు ప్రత్యేక అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్.. తమిళుల మనసు దోచుకున్నారు. రెప్పార్పకుండా.. పవన్‌నే చూసేలా చేశారు. ఆహార్యం నుంచి ఆవేశం వరకు.. కట్టు-బొట్టు నుంచి మాటల వరకు కూడా ఆద్యంతం పవన్ కల్యాణ్ తమిళులను కట్టిపడేశారు.
సహజంగా పవన్ కల్యాణ్.. ఎక్కడికి వెళ్లినా ఫ్యాంటు షర్టు, లేకపోతే ఫైజమా లాల్చీ ధరిస్తారు. గతంలో కుంకీఏనుగులు తీసుకు వచ్చేందుకు కర్ణాటకకు వెళ్లిన సమయంలోనూ ఆయన ఆహార్యంలో ఎలాంటి మార్పూ రాలేదు. ఇక, ఢిల్లీకి వెళ్లినా.. ఆయన అదే డ్రస్‌లో వెళ్లేవారు. కానీ, తాజాగా తమిళనాడులో పర్యటించిన పవన్.. చొక్కా ధరించి.. తమిళ సంప్రదాయ వస్త్రాలంకరణ అయిన.. లుంగీ కట్టుకున్నారు. తమిళంలో ధోతి అంటారు. అంతేకాదు.. నుదిటిన విభూది రేఖను ధరించారు. బొట్టు పెట్టుకు న్నారు. మెడలో రుద్రాక్ష మాల కూడా ధరించారు.
ఇది తమిళులను ఎంతో ఆకట్టుకుంది. ఇక, మాట విషయానికి వస్తే.. ఆయన దాదాపు 40 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆవేశం-ఆక్రోశం-ఆనందాల సమ్మిళితంగా ఆయన ప్రసంగం కొనసాగింది. అయితే.. ఆయన ఎక్కడా ఇతర భాషా ప్రయోగాలు చేయలేదు. పూర్తిగా తమిళంలోనే తనప్రసంగాన్ని దంచికొట్టారు. ఇదేసమయంలో తమిళుల ఆరాధ్య కవి.. సుబ్రహ్మణ్య భారతి రచించిన పుస్తకాల్లోని కొన్ని పంక్తులను, తిరుక్కురణ్ సూక్తులను ఉటంకించారు.
``సాదుమిరండాల్ కాడు కొల్లాడు`` అంటూ తమిళ సూక్తులను కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అచ్చమిల్లై.. అచ్చమిల్లై.. అంటూ తమిళులకు వారి భాషలోనే ధైర్యం నూరిపోశారు. ఆది నుంచి చివరి వరకు కూడా తమిళంలోనే ప్రసంగించి.. అందరినీ ఆకట్టుకున్నారు. చివరలో `వెట్రివేల్ మురుగన్`, `నండ్రి, వణక్కం` అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఇలా.. ఆద్యంతం పవన్ కల్యాణ్ పక్కా తమిళుడిగా మారిపోవడంతో అక్కడివారికి తెగ నచ్చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.
