Begin typing your search above and press return to search.

వారిది సూడో సెక్యులరిజం...ఏకి పారేసిన పవన్!

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధురై సభలో రాజకీయ ప్రత్యర్ధులను ఏకి పారేశారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 5:27 AM
వారిది సూడో సెక్యులరిజం...ఏకి పారేసిన పవన్!
X

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధురై సభలో రాజకీయ ప్రత్యర్ధులను ఏకి పారేశారు. సిద్ధాంతాల పేరు చెప్పి దేశంలో చేస్తున్న రాజకీయాలను సైతం ఎండగట్టారు. అంతే కాదు సెక్యులరిజానికి సూడో సెక్యులరిజానికి మధ్య తేడాను ఎంతో చక్కగా చెప్పారు.

నిజానికి సూడో సెక్యులరిజం గురించి గతంలో బీజేపీ నేతలు పదే పదే చెప్పారు కానీ జనంలోకి అవి ఎంత మేరకు వెళ్ళాయన్నది తెలియదు కానీ పవన్ లాంటి చరిష్మా టిక్ లీడర్ సినీ గ్లామర్ నిండుగా ఉన్న వెండి తెర వేలుపు ఆధ్యాత్మికత మనసారా నింపుకున్న ఒక భారీ సభలో నిలిచి సూడో సెక్యులరిస్టుల మీద విమర్శలు చేసినపుడు అది కచ్చితంగా దేశమంతా రీ సౌండ్ చేస్తుంది అన్నది స్పష్టం.

పవన్ మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో చాలా విషయాలను చెప్పారు. అందులో ఆయన అన్న ఒక మాట అందరినీ ఆలోచింప చేస్తుంది. ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, అదే విధంగా ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చును, అదే ఒక హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం వీరికి ఎందుకు అభ్యంతరం అని అంటూ పవన్ సూటిగా ధాటీగా నిలదీశారు.

ఒక వైపు చూస్తే హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారని దీనిని సెక్యులరిజం అందామా అని ప్రశ్నించారు. వారిది సెక్యులరిజం కానే కాదని కచ్చితంగా సూడో సెక్యులరిజమే అని పవన్ నిర్దారించారు. ఇలాంటి వారి ఆలోచనలు పూర్తిగా వేరేగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు, వీరే అసలైన విభజన వాదులని అన్నాఉరు. వారిది విభజన ఆలోచనగా కూడా ఆయన విమర్శించారు. ఇక ధర్మం గురించి కూడా ఆయన తనదైఅ శైలిలో చెప్పారు. దుష్ట శిక్షణ అన్నదే ధర్మమని నిర్వచించారు. అంతే కాదు అందరినీ సమానంగా చూడడం ధర్మంలో భాగమని అన్నారు.

ఇక మురుగన్ సభను తమిళనాడులో నిర్వహిస్తే ఎందుకు చేయాలని కొందరు అడుగుతున్నారని గుజరాత్ లోనే యూపీలోనో చేయమని సలహా ఇస్తున్నారని పరోక్షంగా అధికార డీఎంకే మీద మండిపడ్డారు. ఇలా ప్రశ్నలు వేసే వారు రేపు శివుడి మీద అమ్మ వారి మీద కూడా ప్రశ్నలు వేస్తారు అని వారిది అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అని పవన్ అన్నారు.

జనసేన ప్రస్థానాన్ని గురించి ఆయన చెబుతూ తాను 2014లో హైదరాబాద్ లో పార్టీ స్థాపించానని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు తన బాల్యం యవ్వనం అంతా తమిళనాడులోనే గడచింది అని ఆయన చెప్పారు అలా తాను తమిళనాడు సంస్కృతిని అర్ధం చేసుకుని గౌరవాన్ని పెంచుకున్నానని కూడా ఆయన చెప్పారు.

అంతే కాదు మధురై ప్రాచీన నగరంగా ఉందని పవన్ చెబుతూ ఏథెన్స్ కంటే చాలా పురాతనమైనదిగా తెలిపారు. ఇక తాను ఒక ఆధ్యాత్మిక సభలో మాట్లాడుతానని కానీ మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య హిందూ సాధువుల మధ్య ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తాను అని కానీ ఏ రోజూ అసలు ఊహించలేదని పవన్ అన్నారు.

తనలోని ఆధ్యాత్మిక భావాలు చిన్నతనం నుంచే ఉన్నాయని పవన్ చెప్పారు. తాను పదహారు ఏటే శబరిమల వెళ్ళాను అని థైపూసం సందర్భంగా తిరుత్తణికి భక్తుల పోటును చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతే కాదు ప్రతీ రోజూ విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్లినవాడిని అన్నారు.

ఇక మురుగన్‌ భక్తి విశేషాల గురించి కూడా పవన్ చాలానే చెప్పారు. ఆయనను నమ్మితే విజయం తధ్యం అన్నారు. మురుగన్‌ను నమ్మితే ఎదుగుదలతో పాటు శక్తి వస్తుందని అన్నారు. అంతే కాదు స్కంధ షష్టి కవచం మనస్సును ఉక్కుగా చేస్తుందని పవన్ చెప్పారు. శత్రువులు ఎంత మంది ఉన్నా మురుగన్ తండ్రి శివుడి మెడలోని నాగు పాముని చూస్తే చూసే పారిపోతారని పవన్ అంటూ మురుగన్ భక్తిలో ఉన్న వారికి మంచి మార్పు కచ్చితంగా వస్తుందని అన్నారు.

కొందరి కుత్సిత ఆలోచనల వల్ల మురుగన్ ధర్మం ఆగదని పవన్ ప్రత్యర్థుల మీద హాట్ కామెంట్స్ చేశారు. ఎల్ల కాలంలోనూ ధర్మం నడుస్తూనే ఉంటుందని అన్న్నారు. ఇక్కడ ఆయన మరో విషయం కూడా చెప్పారు. ఈ ప్రపంచంలో తొలి విప్లవ నాయకుడు మురుగన్ అని అభివర్ణించారు. మురుగన్‌కు బేధభావం లేదని. అందరూ ఆయనకు సమానమే అన్నారు.

అదే విధంగా మధురై ఆధ్యాత్మిక విశిష్టతను కూడా పవన్ చెప్పుకొచ్చారు. అక్కడ పార్వతి దేవి స్వరూపం మీనాక్షీ అమ్మవారు ఉన్నారని, అలాగే పరమ శివుడు సుందరేశ్వరిని రూపంలో కొలువయ్యారని, ఇక వారి కుమారుడు కార్తికేయుడు సైతం అక్కడే కొలువై ఉన్నారని పవన్ అన్నారు. అలా షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో తొలిది ఆరవది మధురై ప్రాంతంలోనే ఉండడం గొప్ప ఆధ్యాత్మిక వైభవానికి సంకేతం అన్నారు.

ఇక ఈనాటి తరం మధురై గురించి తెలుసుకోవాలని పవన్ ఆకాంక్షించారు. మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణమని, అలాగే మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారి స్వరూపమని పవన్ అభివర్ణించిన తీరు సభికులను మంత్ర ముగ్దులను చేసింది. పవన్ కళ్యాణ్ లో ఇంతటి ఆధ్యాత్మికత ఉందా ఆయనలో ఇంతటి భక్తి ప్రపత్తులు ఆలోచనలు చూసిన వారు అంతా నిజంగా కొత్త పవన్ నే చూస్తున్నారు. మధురై లో పవన్ చేసిన ప్రసంగం ఆధ్యాత్మికపరులను నిజంగా ఉర్రూతలూగించింది అనే చెప్పాలి. అంతే కాదు సూడో సెక్యులరిస్టులకు పవన్ తన విమర్శలతో గట్టి షాక్ ఇచ్చారని కూడా చెప్పాలి.