లులు మాల్ భూముల వెనక్కి.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం వెనుక పవన్?
ప్రతిపక్షాలతోపాటు కూటమి ప్రభుత్వంలో కీలక మిత్రపక్షమైన జనసేన అభ్యంతరాలతోనే లులు మాల్ కు భూములు కేటాయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందా? అనే చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 9 April 2026 7:25 PM ISTలులు మాల్ కు విజయవాడలో కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కారణమా? అన్న చర్చ రాజకీయంగా సంచలనం రేపుతోంది. బహుళజాతి వ్యాపార దిగ్గజం లులు మాల్ గ్రూపునకు భూములు కేటాయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టులో స్పష్టం చేసింది. లులుకు భూముల కేటాయించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావుతో పాటు విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కౌంటరు దాఖలు చేసిన ప్రభుత్వం లులు మాల్ గ్రూపునకు భూ కేటాయింపుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులపై విస్తృత చర్చ జరుగుతోంది.
విజయవాడ పాత బస్టాండ్ స్థలాన్ని లులూ మాల్ కు కేటాయించడంపై ప్రజా సంఘాలు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లులు మాల్ కు కేటాయించాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారించింది. అయితే లులూకు భూములు కేటాయించడం లేదని ప్రభుత్వం మెమో దాఖలు చేసిందని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనానికి నివేదించారు.
ప్రతిపక్షాలతోపాటు కూటమి ప్రభుత్వంలో కీలక మిత్రపక్షమైన జనసేన అభ్యంతరాలతోనే లులు మాల్ కు భూములు కేటాయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందా? అనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని జరుగుతున్న ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఇది ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రభావానికి నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే లులు మాల్ కి విజయవాడలో భూ కేటాయింపులను వెనక్కి తీసుకోవడానికి పవన్ కారణం కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి ఏపీలో పెట్టుబడులకు లులు గ్రూప్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నం, విజయవాడల్లో మాల్స్ పెట్టడంతోపాటు గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లులు గ్రూప్ ముందుకొచ్చింది. అయితే మల్లవల్లి పారిశ్రామికవాడలో కోర్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతిపాదనపై గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ పూర్తి వివరాలు కోరారు. ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో గోవధ చేస్తే అనుమతించొద్దని తేల్చిచెప్పారు. దీంతో అప్పట్లో ఉప ముఖ్యమంత్రి అభ్యంతరాలు తీవ్రస్థాయి చర్చకు దారితీశాయి.
ఇక ఆ తర్వాత లులు గ్రూపునకు విజయవాడ, విశాఖపట్నంలో ఖరీదైన స్థలాలు కేటాయించడంపై ప్రజా సంఘాలు హైకోర్టులో సవాల్ చేశాయి. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు భూముల కేటాయించాలంటే 2012లో ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీకి అనుగుణంగా ఉండాలని చెబుతున్నారు. కానీ లులు గ్రూపునకు ఏపీ టూరిజమ్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ కింద ఈ ఏడాది మార్చిలో తీసుకువచ్చిన జీవో 1 ప్రకారం భూములు కేటాయించారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి జీవో 1 ప్రకారం భూముల కేటాయించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని వ్యాఖ్యానిస్తున్నారు.
