మంత్రుల సమక్షంలో లోకేశ్ పై పవన్ కామెంట్స్.. వైరల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వీడియో వైరల్ అవుతుంది. కేబినెట్ భేటీ సందర్భంగా పవన్ తో లోకేశ్ భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 4 Jun 2025 2:41 PM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వీడియో వైరల్ అవుతుంది. కేబినెట్ భేటీ సందర్భంగా పవన్ తో లోకేశ్ భేటీ అయ్యారు. గతంలో తాను నిర్వహించిన పాదయాత్ర యువగళం అనుభవాలను మరోసారి గుర్తు చేసుకుంటూ, పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కు అందజేశారు. నాటి వైసీపీ పాలనలో వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలతోపాటు పాదయాత్రలో ప్రజలు చెప్పిన విషయాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. పలువురు మంత్రులు వెంటరాగా, సచివాలయంలోని పవన్ చాంబరుకు వెళ్లిన లోకేశ్ ను పవన్ సాదరంగా ఆహ్వానించారు.
పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కూటమి విజయంలో కీలక భూమిక పోషించారని లోకేశ్ ను పవన్ అభినందించారు. అప్పటి అనుభవాలను కళ్లకు కట్టినట్లు పుస్తకం తీసుకురావడంపై ప్రశంసలు కురిపించారు. అరాచక పాలన అంతమై నేటికి ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పీడకలను ప్రజలు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. పాదయాత్ర నాటి అనుభవాలను పవన్ తో లోకేశ్ పంచుకున్నారు.
2023 జనవరి 27న ప్రారంభించిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొత్తం 3,132 కిలోమీటర్ల మేర సాగింది. దాదాపు 226 రోజులు ప్రజల మధ్య గడిపిన లోకేశ్ నాయకుడిగా తన సామర్థ్యాన్ని పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నారు. 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ స్థానాల మీదగా సాగిన పాదయాత్రలో భారీ బహిరంగ సభలతోపాటు హలో లోకేశ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ప్రాంతాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించారు. రైతులు, మహిళలు, యువత వంటి అనేక వర్గాలతో విడివిడిగా భేటి కావడంతోపాటు వారి సమస్యలు తెలుసుకుని ప్రజల సాధక బాధలపై అవగాహన పెంచుకున్నారు. పాదయాత్ర తర్వాత పార్టీపై లోకేశ్ కు పూర్తి పట్టు వచ్చినట్లు చెబుతున్నారు.
లోకేశ్ పాదయాత్రతో టీడీపీ విజయతీరాలకు చేరిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక పార్టీకి భావి నాయకుడిగా ఎదిగే క్రమంలో తన పాదయాత్ర చిరస్మరణీయంగా ఉండేలా నాటి అనుభవాలతో ప్రత్యేకంగా పుస్తకం రూపొందించారు లోకేశ్. దీని తొలి ప్రతిని తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీకి అందజేశారు. ఆ తర్వాత మహానాడు వేదికపై సీఎం చంద్రబాబుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కేబినెట్ మీటింగులో తన సహచరుడు, డిప్యూటీ సీఎం పవన్ కు మరో ప్రతిని అందజేశారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలకు పాదయాత్ర పుస్తకాన్ని అందజేసినట్లు చెబుతున్నారు.
