Begin typing your search above and press return to search.

పవన్ సూపర్.. లోకేశ్ సూపర్ డూపరు.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Political Desk   |   11 Nov 2025 4:44 PM IST
పవన్ సూపర్.. లోకేశ్ సూపర్ డూపరు.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
X

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. గత పదిహేడు నెలలుగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తిగా సహకరిస్తున్నారని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా యువనేత, మంత్రి నారా లోకేశ్ పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేస్తూ పరిశ్రమలనుు సాధించి రాష్ట్రానికి తీసుకువస్తున్నారని సీఎం అభినందించారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతికి పవన్, లోకేశ్ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు.

రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా మరో 49 పార్కులకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో 1597 ఎంఎస్ఎంఈ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్, లోకేశ్ పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు పది లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సేకరించారు. వీటికి అదనంగా ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో మరో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగనున్నాయి. కేవలం 17 నెలలోనే ఈ స్థాయిలో పెట్టుబడలను ఆకర్షించడం వెనుక కూటమి పార్టీల కృషి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ప్రధానంగా తనతోపాటు ఐటీ మంత్రి లోకేశ్ కూడా పారిశ్రామికవేత్తలను కలుస్తూ పెట్టుబడులను ఆకర్షించేందుకు కష్టపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతినిర్ణయాన్ని సమర్థిస్తూ పవన్ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంటున్నారు.

ఇలా కేబినెట్ లో ఇద్దరు కీలక మంత్రులను కొనియాడిన సీఎం.. అదే సందర్భంలో ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి అన్నారు. "చెత్త నుంచి సంపద సృష్టించడమే ఇప్పుడు కొత్త విధానం. కొత్తగా ఏర్పాటు అవుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు దీనిని అందిపుచ్చుకోవటం సంతోషదాయకం. దీనిద్వారా రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కలుగుతుంది. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్, నీళ్లు, రహదారులు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యోగాలు ఇవ్వటం కాదు... పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్పి ఇప్పుడు దానిని నిరూపిస్తున్నాం. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రంలో 17 నెలల క్రితం పాలనా పగ్గాలు చేపట్టాం. ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నాం’’ అని సీఎం వివరించారు.

గత పాలకులు పీపీఏలు రద్దు చేశారు. కరెంటు వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించారు. ఆ నిధులు వృధా కాకుండా ఉండి ఉంటే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టుకునే వాళ్లం. అన్ని విధాలుగా గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో ఛలోఛలో అని పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే... ఇప్పుడు భలేభలే అంటూ రాష్ట్రానికి వస్తున్నారు. విశాఖకు లక్ష కోట్ల పెట్టుబడితో గూగుల్ కంపెనీ వస్తోంది. ఇదీ కూటమి ప్రభుత్వంపై కంపెనీలకు ఉన్న విశ్వాసం. కేంద్రం ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని మొదట అమలు చేస్తోంది ఏపీనే. ప్రధాని మోదీ ఏది మొదలు పెట్టినా ఏపీలో తక్షణం అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.