సమర్ధంగా పోక్సో చట్టం ...సీఎస్ డీజీపీలకు పవన్ కీలక లేఖ
ఏపీలో పోక్సో చట్టం 2012ని సమర్ధంగా అమలు చేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖ రాశారు.
By: Satya P | 16 July 2026 12:27 AM ISTఏపీలో పోక్సో చట్టం 2012ని సమర్ధంగా అమలు చేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖ రాశారు. ప్రతి బిడ్డకూ భద్రత గౌరవం న్యాయం పొందే హక్కు ఉందని అంటూ పవన్ ఆ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. అంతే కాదు చిన్నారులకు సకాలంలో న్యాయంతో పాటు మెరుగైన రక్షణ కల్పించేందుకు పవన్ ఈ లేఖలో పలు కీలక సూచనలు సైతం చేశారు.
సమయ పాలన ముఖ్యమంటూ :
ఇక పోక్సో కేసుల దర్యాప్తు అలాగే ఛార్జిషీట్ దాఖలును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన కోరడం జరిగింది. నిందితుల బెయిల్ పిటిషన్ల విషయంలో ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు వినిపించి బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలని సూచించారు. అదే విధంగా బాధితుల రక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంతో పాటు ప్రతి జిల్లాలోనూ పర్యవేక్షణ సెల్ ఏర్పాటు చేయాలని పవన్ కోరారు. దర్యాప్తు అధికారులకు చిన్నారులతో ఎలా వ్యవహరించాలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.
సమగ్ర దర్యాప్తు అవసరం :
ఇక ఈ లేఖలో భాగంగా నెల్లూరు జిల్లా రెహ్మతాబాద్ దర్గా వ్యవహారాన్ని ప్రత్యేకంగా పవన్ ప్రస్తావించారు. పోక్సో కేసు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి దర్గా బాధ్యతలలో కొనసాగడంపై వక్ఫ్ బోర్డు అలాగే జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కూడా పవన్ సూచించారు. ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకుని 30 రోజుల్లోగా సమగ్ర కార్యాచరణ నివేదికను సమర్పించాలని ఆయన ఆదేశించారు.
షాబాద్‌లో పోక్సో కేసు ప్రస్తావన :
ఇదిలా ఉంటే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి తర్వాత బెయిల్ మీద వచ్చి ఏకంగా బాధితురాలి కుటుంబసభ్యులను వారితో పాటుగా తన సొంత కుటుంబాన్ని కడతేర్చిన ఘటనను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించడం విశేషం. ఏపీలో చూస్తే నెల్లూరు జిల్లా రెహమతాబాద్ దర్గా ఘటనను కూడా పవన్ ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇదే విషయం మీద ముుస్లిం మత పెద్దలు,అలాగే ముస్లిం సభ్యులు స్థానిక నివాసితుల నుంచి తన కార్యాలయానికి అనేక వినతులు వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ దర్గాకు వంశపారంపర్యంగా అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి పోక్సో విచారణను ఎదుర్కొంటున్నారని అయినా ఆయన విధులు నిర్వహిస్తున్నారు అని పవన్ గుర్తు చేశారు. అందుకే ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసులలో అసలు విషయాన్ని పోలీసులు ఏపీ వక్ఫ్ బోర్డుకు జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని పవన్ సూచించారు.
ఇవన్నీ ఆందోళనకరం :
తెలంగాణాలోని షాబాద్ లో జరిగిన ఆరు హత్యలను పవన్ పేర్కొంటూ పోక్సో కేసులలో నిందితులు బాధితులను వారి కుటుంబాలను భయపెడుతున్నారని శారీరకంగా హింసించడం వంటి ధోరణి పెరిగితే అది ఎంతో ఆందోళన కలిగించే విషయం అని పవన్ పేర్కొన్నారు. కఠినమైన సెక్షన్లు పెట్టినా బెయిల్ మీద షాబాద్ కేసు నిందితుడు బయటకు వచ్చాడని క్రూరంగా ఆరుగురిని చంపేశాడు అని పవన్ లేఖలో గుర్తు చేశారు.
కట్టుదిట్టంగా ఉండేలా :
ఇక పోక్సో కేసులలో బాధితులకు తగిన రక్షణ లేకపోవడం మీద కూడా పవన్ ఈ లేఖలో సీఎస్ డీజీపీ దృష్టికి తీసుకుని వచ్చారు. బెయిల్ పరిశీలించే విషయంలో కఠినంగా వ్యహరించలేకపోవడం తదనంతర విపత్కర పరిస్థితులకు దారి తీస్తోంది అని పవన్ లేఖ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోరాదని పవన్ కోరారు షాబాద్ ఘటన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. పవన్ తన శస్త్ర చికిత్సను ముంబై ఆసుపత్రిలో చేయించుకుని తిరిగి రాగానే ఇదే అంశం ప్రస్తావిస్తూ పోక్సో కేసుల విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని కోరడం ఇపుడు చర్చనీయాంశం అయింది.
