పవన్ ను ఇరకాటంలో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడెలా?
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాత్ర అత్యంత కీలకం. ఏడాదిగా చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక పవన్ పాత్ర ఉంటోంది.
By: Tupaki Desk | 3 Jun 2025 4:45 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాత్ర అత్యంత కీలకం. ఏడాదిగా చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక పవన్ పాత్ర ఉంటోంది. అంతేకాకుండా పాలనలో చంద్రబాబుతో పాటు పవన్ మార్కు కనిపించేలా ఆయన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్లె పండుగ, అడవి తల్లి బాట, మన ఊరు-మాటామంతీ వంటి పలు కార్యక్రమాలకు పవన్ శ్రీకారం చుట్టడమే కాకుండా వాటిని విజయవంతం చేశారు. ఇలా ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేక పంథా అనుసరిస్తూ అభినందనలు అందుకుంటున్న పవన్ ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో చిక్కుకున్నారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని సమర్థించాలా? విభేదించాలో తెలియని డైలమాలో పవన్ తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితికి హోంశాఖ తీసుకున్న ఓ నిర్ణయమే కారణమని అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ తో చర్చించిందా? లేదా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. పవన్ ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసిన ఆ నిర్ణయం ఆయన సొంత సామాజికవర్గానికి చెందినది కావడంతో సమస్య అతి సున్నితంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పవన్ సామాజికవర్గం వైఖరి ఎలా స్పందిస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
2014-19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉండగా, రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి అప్పటి కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి నాయకత్వం వహించారు. కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్ తో 2016లో కాకినాడ జిల్లా తునిలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అప్పట్లో విపక్షం వైసీపీ మద్దతు పలికింది. అయితే తునిలో సభ జరుగుతుండగానే, కొందరు అల్లరి మూకలు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను తగులబెట్టారు. ఆ తర్వాత తుని పోలీస్ స్టేషన్ తోపాటు పలు ప్రభుత్వ సంస్థలపై దాడులు చేశారు.
అప్పట్లో తీవ్ర సంచలనంగా మారిన ఈ విధ్వంసంపై ప్రభుత్వం సుమారు 161 కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన కాపు ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేసింది. అంతేకాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురిని అరెస్టు చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2022లో ఈ కేసులను ఉప సంహరించుకుంది. దీంతో కేసుల నుంచి కాపు నేతలకు విముక్తి కల్పించినట్లైంది. అయితే తాజాగా ఈ కేసులను రీ ఓపెన్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుందని అంటున్నారు. గత ప్రభుత్వం కేసులు ఉప సంహరించుకోవడంతో కాపు నేతలపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది. అయితే తాజాగా ఆ తీర్పుపై అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కాపు నేతలు కేసులను ఎదుర్కొవాల్సివుంటుందని అంటున్నారు.
ఈ పరిస్థితి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కాపుల మద్దతుతో పవన్ భారీ విజయం సాధించారని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో కాపు నేతలు అందరూ ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాపు ఉద్యమంలో కీలక నేతలు అయిన ముద్రగడ పద్మనాభరెడ్డి, హరిరామజోగయ్య ప్రస్తుతం పవన్ కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పెట్టిన కేసులతో ఎక్కువ మంది జనసేన సానుభూతిపరులు ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఉందంటున్నారు. దీనిపై పవన్ స్పందన కోసం వారంతా ఎదురుచూస్తున్నారు.
