జగన్ కోసం పవన్.. పవన్ కోసం.. వారు ..!
రాజకీయాల్లో నాయకులు పెట్టుకునే లక్ష్యాలు మంచిదే. లక్ష్యం లేనిదే.. వ్యక్తిగత జీవితం కూడా చప్పగానే ఉంటుంది.
By: Tupaki Desk | 7 July 2025 8:30 AM ISTరాజకీయాల్లో నాయకులు పెట్టుకునే లక్ష్యాలు మంచిదే. లక్ష్యం లేనిదే.. వ్యక్తిగత జీవితం కూడా చప్పగానే ఉంటుంది. అయితే.. ఆ లక్ష్యాలు.. నాయకులను నమ్ముకున్నవారిపైనా.. నాయకులపై ఆశలు పెట్టుకున్నవారిపైనా ప్రభావం చూపితే.. అది ప్రమాదా నికి దారి తీస్తుంది. ఈ విషయం ఇతర పార్టీల్లో ఎలా ఉన్నప్పటికీ..జనసేనలో మాత్రం చర్చగా మారింది. జనసేన లక్ష్యం ఏంటి.. అనేది ప్రశ్నిస్తే.. జగన్‌ను అధికారంలోకి రాకుండా చేయడమేనని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చెబుతున్నారు. ఇది ఆయన పెట్టుకున్న లక్ష్యం కావొచ్చు.
గత ఏడాది ఎన్నికలకు ముందుకూడా.. జగన్‌ను అధికారం నుంచి దింపేయడమే లక్ష్యంఅంటూ.. ప్రకటనలు గుప్పించారు. ప్రచారం కూడా చేశారు. అయితే.. అది తొలిసారి కాబట్టి.. అందరూ హర్షించారు. పవన్ తీసుకున్న నిర్ణయాన్ని.. పెట్టుకున్న లక్ష్యాన్ని స్వాగతించారు. కట్ చేస్తే.. పవన్‌ను అభిమానించేవారు.. ఆయన సామాజిక వర్గం నాయకుల లక్ష్యం ఏంటన్నది చూస్తే.. జనసేన నేరుగా అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రి పీఠాన్ని తీసుకోవడం. దీనిలో పవన్‌ను అభిమానించేవారికి.. కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఎలాంటి డౌటు లేదు. వారిది ఒకే లక్ష్యం.
గత ఎన్నికలకు ముందు అయినా.. ప్రస్తుతం అయినా.. కాపు సామాజిక వర్గం సహా.. పవన్ అభిమానులు సీఎంగా ఆయనను చూడాలనేదే. అదేసమయంలో మెజారిటీ సీట్లను దక్కించుకుని విజయం దక్కించుకోవాలన్నదే. కానీ.. గత ఎన్నికల్లో పవన్ చేసిన వ్యాఖ్యలను వారు సర్దుకుపోయారు. కానీ, ఇప్పుడు కూడా.. అదే పంథా అంటేనే వారు విభేదిస్తున్నారు. రెండు రోజుల కిందట మార్కాపురం సభలో కూడా పవన్ వచ్చే 15 ఏళ్లు జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానని చెప్పారు. ఇది మంచిదే. ప్రత్యర్థిని అధికారంలోకి రాకుండా చేయడమే రాజకీయం.
కానీ, ఇదేసమయంలో తమ పార్టీ సంగతేంటి? అనేదే జనసేన నాయకులు, కాపు సామాజికవర్గం ప్రశ్నిస్తున్న మాట. అలాగని వారు కూటమిలో ఉండొద్దనికానీ.. చంద్రబాబుసూచనలు పాటించవద్దని కానీ.. చెప్పడం లేదు. మెజారిటీ అభిమానులు, కాపు సామాజిక వర్గంలోని మెజారిటీ నాయకులు కూడా సీఎంగా పవన్‌ను చూడాలని అనుకుంటున్నదే లక్ష్యం. కాబట్టి.. వారు దానినే ప్రశ్నిస్తున్నారు. ``జగన్ కోసం పవన్ నిలబడ్డారు. ఆయనను ఓడించారు. మరి వచ్చే ఎన్నికల నాటికి కూడా.. మేం ఎదురు చూడాల్సిందేనా?`` అనే గళం బలంగా క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. సో.. పవన్ కోసం.. నిలబడిన వారి మాట కూడా ఆయన వినాల్సి ఉంది. మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకుని వారిని సంతృప్తి పరచాల్సి ఉంది. లేకపోతే.. వారు దారి తప్పే అవకాశం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు.
