హిందువులను టార్గెట్ చేస్తారా? పాకిస్థాన్ ప్రేమికులపై జనసేనాని ఫైర్
పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు.
By: Tupaki Desk | 29 April 2025 8:53 AMపహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని జనసేన పార్టీ సంతాపం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పాకిస్థాన్ ను వెనకేసుకువస్తున్న వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రేమ ఉన్న వారు ఆ దేశానికి వెళ్లిపోవచ్చన్నారు. హిందువుల దేశంలో హిందువులనే టార్గెట్ చేస్తారా? మతం అడిగి మరీ చంపేస్తారా? అంటూ పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
మృతులకు సంతాపం ప్రకటిస్తూ జనసేన నేతలు రెండు నిమిషాల పాటు నేతలు మౌనం పాటించారు. ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసిందని డిప్యూటీ సీఎం పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. షికారుకు వచ్చినట్లు వచ్చి అమాయకులను చంపేశారని, ఐడీ కార్డులు అడిగి హిందువా? ముస్లింవా అని తెలుసుకుని చంపేయడం క్రూరమని అన్నారు. నిరాయుధులతో యుద్ధం చేయడమేంటని ప్రశ్నించారు. ఈ సంఘటనను దేశంమొత్తం ఖండించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులపై కనికరం చూపకూడదని కేంద్రాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
కశ్మీరులో ఉగ్రవాదుల హింసతో లక్షలాది మంది కశ్మీర్ పండిట్లు వలస వెళ్లిపోయారని చెప్పారు. తాను 1886-89 మధ్య కశ్మీరుకు వెళ్లినప్పుడే పరిస్థితులు దిగజారుతున్నట్లు తెలిసిందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కశ్మీర్ మండుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో కశ్మీర్ అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ఎప్పటికీ కశ్మీర్ ను భారత్ నుంచి వేరు చేయలేరన్నారు. ఎవరైనా పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడతామంటే, వారంతా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఉగ్రవాదులు కాల్చుకుంటూ పోతే మేము చూస్తూ ఊరుకోమన్నారు. కాగా, ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ కుటుంబానికి జనసేన తరపున రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు.