పవన్ లెక్కలు పక్కాగా !
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయంగా బాగా అవగాహన ఉన్న వారే.
By: Tupaki Desk | 31 May 2025 3:00 PM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయంగా బాగా అవగాహన ఉన్న వారే. ఆయనకు రాజకీయం తెలియదు అనుకున్న వారికి 2024 ఎన్నికల ఫలితాలు దిమ్మదిరిగేలా చేశాయి. స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అని మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన కవితలుగా ఏనాడో రాసుకున్నారు. అందులో సారాంశం అందరికీ వరిస్తుంది.
అలా జనసేనానికి తన బలం బలగం అన్నీ పూర్తి అవగాహనతో ఉన్నాయని అంటారు. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందలేనని కూడా పదే పదే చెప్పారు. టీడీపీ బీజేపీ రెండింటితో విడివిడిగా పొత్తులు పెట్టుకుని 2024 ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలను కలిపిన ఘనత పవన్ దే అంటే అతిశయోక్తి లేదు.
అలా కూటమి పొత్తు వల్ల కలసి ఉండడం వల్ల అధిక రాజకీయ లాభాన్ని పవన్ కళ్యాణ్ పొందారు. మరి ఆయన 2029 ఎన్నికలలో వ్యూహం ఎలా వేస్తారు అంటే కచ్చితంగా పొత్తుతోనే లాభం అన్న దానిని అనుసరించి ఆ విధంగానే అని అంటున్నారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుని ఆరాధిస్తూ అభిమానిస్తున్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీని కూడా ఎక్కువగా అభిమానిస్తున్నారు. దాంతో కూటమితోనే పొత్తులు కడతారు అన్నది రూఢీ అయిపోయిన విషయమే.
ఏపీలో వైసీపీ బలంగా ఉన్నంతవరకూ ఆ పార్టీ ప్రత్యర్ధిగా నిలిచి ఉన్నంతవరకూ కూటమి చెక్కుచెదరదు అన్నది రాజకీయపరమైన విశ్లేషణ. 2024లో వైసీపీ ఓటమి పాలు అయినా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. దాంతో వైసీపీకి 2029 ఎన్నికల మీద ఆశలు ఉన్నాయి. సో ఆ ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడిచినపుడే గెలుపు సంపూర్ణం అయినట్లు అని అంటున్నారు.
అందుకే జనసేన కూటమి బంధానికి మిత్ర ధర్మానికి కట్టుబడి పనిచేస్తోంది అంటున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన కచ్చితంగా రెట్టింపు సీట్లకు పోటీ చేస్తుందని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయిదేళ్ళ పాటు అధికారంలో ఉండడంతో జనసేన బలం పెంచుకోవడం, మరింతగా పార్టీని విస్తరించడం ద్వారా సీట్లను కోరే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అదే విధంగా ఏపీలో 175 సీట్లు 225 దాకా పెరుగుతాయని అంటున్నారు. దాంతో జనసేన సీట్లు ఎక్కువ కోరుతుందని అంటున్నారు.
ఇక చూస్తే 2024లో జనసేన 21 సీట్లు తీసుకున్న జనసేన 2029లో 50 అసెంబ్లీ సీట్లు 5 ఎంపీ సీట్లు కోరుతుందని ప్రచారం సాగుతోంది. దాని కోసం కచ్చితంగా జనసేనకు బలం ఉన్న అసెంబ్లీ సీట్లను కనీసంగా అరవై దాకా గుర్తించి ఇప్పటి నుంచే అక్కడ పార్టీ కార్యకలాపాలను పెంచుకోవాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. అక్కడ చురుకుగా ఉన్న నాయకత్వాన్ని గుర్తించి వారికి పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ప్రోత్సాహం ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు.
అంతే కాదు రానున్న నాలుగేళ్ల పాటు ఇలా గుర్తించిన అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలలో జనసేన అధినాయకత్వం తరచూ పర్యటనలు చేస్తూ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ కి తీసుకుని పోవాలని చూస్తోంది అని అంటున్నారు. అంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టడం కంటే అందులో మూడవ వంతు మీద ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడ పార్టీని అభివృద్ధి చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి బలీయంగా పార్టీ తయారు అవుతుందని భావిస్తున్నారు.
ఇక మున్సిపాలిటీలు మండలాలలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఆ ఎన్నికల్లో ఔత్సాహికులు యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణలను అమలు చేయడం ద్వారా జనసేనను పటిష్టం చేయాలని నిర్ణయించారు. మొత్తానికి చూస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన 50 అసెంబ్లీ 5 ఎంపీ సీట్లలో పోటీ చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి జనసేన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందో.
