Begin typing your search above and press return to search.

జనసేన- డిసైడింగ్ ఫ్యాక్టర్ గా !

ఏపీ రాజకీయాల్లో జనసే అతి కీలకమైన పార్టీగా ఉంది. ఈ మాట రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతారు.

By:  Satya P   |   14 March 2026 11:00 AM IST
జనసేన- డిసైడింగ్ ఫ్యాక్టర్ గా !
X

ఏపీ రాజకీయాల్లో జనసే అతి కీలకమైన పార్టీగా ఉంది. ఈ మాట రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతారు. జనసేన లేని ఏపీ రాజకీయాన్ని ఊహించుకోవడం వర్తమానంలో బహు కష్టం. ఏ పార్టీ అధికారంలో ఉండాలో ఏ పార్టీ గద్దె దిగి దూరంగా జరగాలో జనసేన నిర్ణయిస్తోంది. అలా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఏపీ రాజకీయాల్లో జనసేన నిలిచింది. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలను తారు మారు చేసే సత్తాను కలిగి ఉన్న జనసేన పాత్రను ఎవరూ ఏ మాత్రం విస్మరించేనిదిగా ఉంది. జనసేనను కాదనుకుంటే అధికారం లేదనుకున్నట్లే అని విభజన ఏపీలోని గడచిన మూడు ఎన్నికలూ నిరూపించాయి.

పవన్ ఆవేశమే ఊపిరి :

ఇక జనసేన పార్టీ అన్నది పవన్ ఆవేశం నుంచి పుట్టింది. సినీ నటుడిగా మంచి హిట్ల మీద ఉన్న పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న హైదరాబాద్ లో కీలక సమావేశం పెట్టి చేసిన బిగ్ సౌండ్ జనసేన. తాను ఒక్కడిగా వేదిక మీదకు వచ్చి గంటన్నర సేపు మాట్లాడారు, ఆనాటి ఉమ్మడి ఏపీ విభజన రాజకీయాల నుంచి అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఒక్కొక్క మాట నిప్పు కణికగా మారింది. ఉమ్మడి ఏపీలోని నాటి ఎనిమిది కోట్ల మంది మనసులను అది తాకింది. పవన్ అలా ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా రాజకీయంగా ప్రకటన చేసిన రోజే ఆవిర్భవించారు.

అంతా తారు మారు :

విభజన ఏపీలో నాటి పరిస్థితి చూస్తే వైసీపీ మంచి ఊపు మీద ఉందనిపించింది. ఇక అధికారం ఆ పార్టీదే అన్నది అంతా అనుకున్న నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో పవన్ జనసేన పెట్టిన వెంటనే గుజరాత్ వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్ధి అయిన నరేంద్ర మోడీని కలిశారు. బీజేపీకి ఆయన మద్దతు ప్రకటించారు. ఆ తరువాత టీడీపీతో కూడా స్నేహ హస్తం చాటారు. అలా మూడు పార్టీలు కలసి 2014 ఎన్నికల్లో జనంలోకి వెళ్ళాయి. తొలి ఎన్నికల్లో పవన్ జనసేన పోటీ చేయలేదు, మద్దతుగా నిలిచారు. విస్తృతంగా ప్రచారం చేసి పెట్టారు. దాంతో ఏపీలో బంపర్ మెజారిటీతో టీడీపీ బీజేపీ కాంబో గెలిచింది.

విడిపోతే పడిపోయి :

ఇక 2019 నాటికి టీడీపీకి బీజేపీకి దూరంగా జనసేన జరిగింది. అలా కూటమి ఓట్లలో భారీ చీలిక వచ్చింది. ఆ నేపధ్యం అంతా వైసీపీకి ఎంతగానో ఉపయోగపడింది. వైసీపీ 151 సీట్లతో అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దానికి పరోక్ష కారణం పవన్ అన్నది విస్మరించి వైసీపీ నేతలు అధినాయకత్వంతో సహా పవన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. అయిదేళ్ళూ పవన్ వారికి టార్గెట్ అయ్యారు. అలా జనసేనను ఏమీ కాకుండా చూశారు లైట్ తీసుకున్నారు. దాంతో ఏపీలో కూటమి పునరేకీకరణ మొదలైంది.

పనిచేసిన ఫ్యాక్టర్ :

ఇక 2024 ఎన్నికల్లో కలసి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయం దానికి అటు బీజేపీ ఇటు టీడీపీ కూడా కలిసి రావడంతో 2024 ఎన్నికల ఫలితాలు అదిరిపోయే రేంజిలో వచ్చాయి. ఈ కూటమి పిడికిలి బిగిస్తే ఎలా ఉంటుందో వైసీపీకి తెలియచేసిన ఎన్నికలు అవి. 95 శాతం స్ట్రైక్ రేటు తో కూటమి పార్టీలకు సీట్లు దక్కాయి. ఓటు షేర్ కూడా 56 శాతానికి పైగా వచ్చింది. 21 సీట్లకు 21 జనసేన గెలుచుకుని రికార్డులు బద్ధలు కొట్టింది. అలా జనసేన చేయి కలిపితే ఎలా ఉంటుందో ఎదురు తిరిగితే ప్రత్యర్ధులకు స్థానం ఎక్కడ ఉంటుందో తెలియచేసిన ఎన్నికలుగా 2024 ని చెప్పుకోవాల్సిందే.

మాటే శిలా శాసనం :

జనసేన పార్టీ ప్రకటన చేస్తూ పవన్ అన్న మాట ఒకటి ఉంది. జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని. ఆ మాటే శిలా శాసనం అయింది. మూడు ఎన్నికలు వరసగా ఏపీలో జరిగితే అవి అన్నీ పవన్ ఫ్యాక్టర్ చుట్టూనే తిరగడం విశేషం. ఆయన ప్లస్ అయితే ఒకలా మైనస్ అయితే ఒకలా రిజల్ట్ వచ్చింది. ఇప్పటికి కూడా ఒక మాట ఉంది పవన్ కూటమిలో ఉంటే వైసీపీ ఆ కూటమిని ఓడించడం కష్టమని. ఆ విషయం కూటమి పెద్దలకు కూడా తెలుసు అందుకే పవన్ ఏకంగా పదిహేనేళ్ళ పాటు కూటమి ప్రభుత్వం కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు లోకేష్ అదే మాటకు కట్టుబడి ఉన్నారు. అలా జనసేన 13 ఏళ్ళ ప్రస్థానం ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసింది అనే చెప్పాలి. సినీ నటుడిగా ఉంటూ రాజకీయంగా సామాజిక అంశాల పరంగా ఇంత నిబద్ధత కనబరచిన వారు ఒక్క పవన్ తప్ప మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదని అంటారు. సో జనసేన జెండా రెపరెపల వెనక పవన్ ఆవేశం ఎపుడూ నిప్పులు చిమ్ముతూ సాగుతూనే ఉంటుంది.