Begin typing your search above and press return to search.

జనసేన త్యాగానికి తగిన ప్రాతినిధ్యం దక్కాలి : డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళల త్యాగాలను గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   11 Oct 2026 2:23 PM IST
జనసేన త్యాగానికి తగిన ప్రాతినిధ్యం దక్కాలి : డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
X

స్థానిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళల త్యాగాలను గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తల త్యాగాలను గుర్తించాలని కోరారు. అడవితల్లిబాట 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, వేములకొండ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామంలో పవన్ పర్యటించారు. అనంతరం అదే పంచాయతీ పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ. 2.29 కోట్ల వ్యయంతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. రాకోట గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న రచ్చబండ వద్ద గిరిపుత్రులతో ‘మాటా-మంతి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అదేసమయంలో స్థానిక ఎన్నికల విషయంలో డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.




ఈ నెల 15 నుంచి స్థానిక ఎన్నికల సమరం ప్రారంభం అవుతుందనగా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో కూటమి కోసం తాను పనిచేశానని, ఆ సమయంలో ఒక్క కౌన్సిలర్, ఎంపీటీసీ పదవిని కూడా తాము అడగలేదని పవన్ గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో జనసైనికులు, వీర మహిళలు ధైర్యంతో రోడ్డుపైకి వచ్చి పోరాడారని అన్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుని పదవుల్లో తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. నా దేశం బాగుండాలి, నా నేల బాగుండాలని తాను కోరుకుంటానని చెప్పారు. జనసైనికులు కూడా తన మాదిరిగానే పనిచేస్తున్నారని కొనియాడారు. కూటమి నాయకులు అందరికీ మద్దతు ఇచ్చినట్లుగానే జనసేన నాయకులను స్థానిక ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలని, స్థానిక ఎన్నికల్లో గ్రామాల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అడవితల్లి బాట అంటే కేవలం రహదారుల నిర్మాణం ఒక్కటే కాదని, గిరిజనుల జీవితాలను సమూలంగా మార్చే కార్యక్రమమని వ్యాఖ్యానించారు.




ఇక అడవి బిడ్డల కష్టాలు తెలుసుకునేందుకు అరణ్యం మధ్యలోని గిరిశిఖర గ్రామానికి పవన్ వెళ్లారు. సుమారు 350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామాన్ని సందర్శించి, గిరిజనుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చింత చెట్టు కింద కూర్చుని వారితో మమేకమయ్యారు. గిరిజనులు ప్రస్తావించిన సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కారాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థలో ఉన్న రాకోట పాఠశాల పునరుద్ధరణకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేకుల షెడ్డులో కొనసాగుతున్న ఆలయ పరిస్థితిని గమనించిన ఆయన, దేవాదాయ శాఖ సహకారంతో భజన మందిరంగా అభివృద్ధి చేసేందుకు మరో రూ. 20 లక్షలు కేటాయించాలని అధికారులకు సూచించారు.




సమస్యలకు తక్షణ పరిష్కారాలు

‘మాటా-మంతి’ కార్యక్రమంలో రాకోట పరిసర ప్రాంతాలైన వేములకొండ, సువర్లవాడ, డబ్బావలస, తిరుగటిరాళ్లు, కాకవాడ, చిలకవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రతి గ్రామానికి అంగన్‌వాడీ కేంద్రంతో కూడిన మండల పరిషత్ పాఠశాల, విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా దాదాపు రూ. 5 కోట్లు కేటాయించారు. గిరిజనులు తమ సమస్యలను స్వయంగా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో గిరిపుత్రుల్లో భరోసా నింపారు.