175/175.. పవన్ సరికొత్త వ్యూహం!
ఈ విధంగా పార్టీని బలోపేతం చేయడానికి పవన్ దశలవారీగా చర్యలు తీసుకుంటుండటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికి 12 ఏళ్లు అవుతోంది.
By: Tupaki Political Desk | 12 July 2026 12:42 PM ISTజనసేన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే వ్యూహానికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీని పోలింగు బూతు స్థాయిలో బలపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. 2014లో పార్టీ ప్రారంభించిన నుంచి జనసేనాని సెంట్రిక్ గానే పార్టీ కార్యకలాపాలు నడిచాయి. మధ్యలో కొందరు కార్యకర్తలు పార్టీలో చేరిన క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణపై ఇప్పటివరకు ఫోకస్ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఆదరణ ఉన్నప్పటికీ పోలింగు బూతు స్థాయిలో ఓటర్లను సమన్వయం చేసే కేడర్ లేక జనసేన బలం కొంతవరకే పరిమితం అన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీకి పోలింగు బూతు లెవల్ లో కమిటీలు వేయాలని పవన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో వాటా పొందుతోంది. స్థానిక ఎన్నికల్లో కూడా జనసేనకు ప్రాతినిధ్యం పెరగాలని, క్షేత్రస్థాయి కార్యకర్తలకు స్థానికంగా గౌరవం దక్కాలంటే స్థానిక ఎన్నికల్లో గెలవడం అత్యావసరమని జనసేనాని భావిస్తున్నారని అంటున్నారు. దీంతో ఇటీవల పార్టీలో చేరికల కమిటీని నియమించడంతోపాటు పార్టీలో తొలి నుంచి కష్టపడిన కార్యకర్తలను గుర్తించేందుకు మరో కమిటీని నియమించారు.
ఈ విధంగా పార్టీని బలోపేతం చేయడానికి పవన్ దశలవారీగా చర్యలు తీసుకుంటుండటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికి 12 ఏళ్లు అవుతోంది. ఈ పుష్కర కాలంలో పార్టీ విస్తరణపై పవన్ ఎప్పుడు ఇంతలా దృష్టి పెట్టలేదని అంటున్నారు. దీంతో వచ్చే మూడు నెలలో జనసేన పార్టీ భవిష్యత్తు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఇంకా మరో మూడేళ్లు పదవీ కాలం ఉండటం, స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అంచనాలు వ్యక్తమవుతుండటంతో జనసేనాని వ్యూహాం సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన కేడర్ లో జోష్ కనిపిస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి పదవుల ఆశతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు జనసేనలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా జనసేనాని వ్యూహానికి తగినట్లు పార్టీని రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. స్థానిక ఎన్నికల లోగా 175 నియోజకవర్గాల్లోనూ బూత్ కమిటీలు నియమించాలనే లక్ష్యంతో జనసేన నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ బూతు కమిటీలే పార్టీకి కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిణామం ఒక విధంగా విపక్షంతోపాటు కూటమిలోని ప్రధాన పార్టీలు అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితులు సూచిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
