జగనన్న కాలనీకి బ్రిడ్జి… పవన్ అన్నకు కాలనీ వాసుల కృతజ్ఞతలు
పెద్ద పెద్ద వాగ్ధానాలు చేయడమే కాదు.. వాటిని కార్యరూపంలోకి తేవడం చాలా ముఖ్యం. చాలా మంది నేతలు వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు జంకుతారు.
By: Tupaki Desk | 16 Sept 2025 4:42 PM ISTపెద్ద పెద్ద వాగ్ధానాలు చేయడమే కాదు.. వాటిని కార్యరూపంలోకి తేవడం చాలా ముఖ్యం. చాలా మంది నేతలు వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు జంకుతారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఆయన ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా.. తన సమస్యలను నేరుగా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు. పవన్ తీరుతో స్థానిక ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నాడు.
కాలనీ ఏర్పాటు.. వసతులపై ఏమరపాటు..
వైఎస్సార్ ప్రభుత్వంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ పేరుపై పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంతంలో కాలనీలు వెలిశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ కాలనీలు ఏర్పడ్డాయి. ఇల్లు లేని పేదలకు వైసీపీ ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది. కాలనీలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోకుంటే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. దీంతో అప్పో సొప్పో తెచ్చి ఇల్లు నిర్మించుకున్నారు పేదలు. ఇల్లు నిర్మించుకున్నా ఇప్పటికీ ఆ ప్రాంతానికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. రోడ్లు, డ్రైనేజీలు లేవు.. వర్షం నీరు సైతం వెళ్లేందుకు సరైన నిర్మాణాలు లేవు దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.
పెద్ద కాలువే ప్రధాన సమస్య..
జగనన్న కాలనీకి ప్రధాన సమస్య పెద్ద కాలువ. వర్షం పడినప్పుడల్లా ఆ కాలువ ఉప్పొంగి.. కాలనీని ఇతర ప్రాంతాల నుంచి వేరు చేసేది. పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోవడం, ఉద్యోగస్తులు పనులకు వెళ్లలేక ఇబ్బంది పడడం అక్కడి నివాసితుల దైనందిన కష్టంగా మారింది.
గతేడాది పర్యటనలో సమస్యలు తెలుసుకున్న పవన్..
గతేడాది సెప్టెంబర్‌లో పవన్ కల్యాణ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గొల్లప్రోలు–జగనన్న కాలనీ మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేశారు. ముఖ్యంగా, కేవలం ఆర్థిక సాయం ప్రకటించడమే కాదు.. పనులు సైతం వేగంగా పూర్తవ్వాలని నిరంతర ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. ఏడాదిలోనే బ్రిడ్జి పూర్తయ్యింది. ఎన్ని వర్షాలు పడ్డా కాలనీ ప్రజలకు ఇబ్బందులు ఉండడం లేదు. పిల్లలు స్కూలుకు, రైతులు పొలాలకు, కార్మికులు కూలికి హాయిగా వెళ్తున్నారు.
కృతజ్ఞతలు చెప్పిన కాలనీ ప్రజలు..
ప్రజలకు మౌలిక వసతులు కల్పించకపోతే ఇళ్ల స్థలాలు, పథకాలు ప్రయోజనం లేకుండా పోతాయి. వైసీపీ ప్రభుత్వం స్థలాల పంపిణీతో తాను చేసిన పనిని పూర్తయినట్లు భావించింది. కానీ మౌలిక సదుపాయాలను మరిచింది. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని బాధ్యతగా తీసుకున్నారు. దీంతో జగనన్న కాలనీల ప్రజలు పవన్ అన్నకు కృతజ్ఞతలు చెప్తున్నారు.
