నవంబరులో లోకల్ ఫైట్.. సంకేతాలిచ్చిన జనసేనాని
ఈ ప్రక్రయలు అన్నీ మరో నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉండటంతో అక్టోబరు లేదా నవంబరులో ఎన్నికలు నిర్వహణకు సిద్ధమవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 11 July 2026 12:00 AM ISTఏపీలో స్థానిక ఎన్నికలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబరులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పవన్ స్వయంగా వెల్లడించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలలో స్థానిక సందడి మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాలకు ఇప్పటికే గడువు ముగిసింది. జిల్లా, మండల పరిషత్ లకు సెప్టెంబరులో పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో అక్టోబరు లేదా నవంబరులో పంచాయతీ, స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ మాటల ద్వారా తెలుస్తోందని అంటున్నారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎప్పుడో సిద్ధమైందని అంటున్నారు. గడువుకు ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని గతంలో భావించిందని చెబుతున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లతోపాటు సర్ ప్రక్రియ ఉండటం వల్ల ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకుందని సమాచారం. ప్రస్తుతం సర్ ప్రక్రియ వేగంగా జరుగుతుండగా, బీసీ రిజర్వేషన్లపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ నియమించింది. ఈ కమిషన్ ప్రస్తుతం జిల్లాల్లో పర్యటిస్తూ రిజర్వేషన్ల పెంపుపై అధ్యయనం చేస్తోంది.
ఈ ప్రక్రయలు అన్నీ మరో నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉండటంతో అక్టోబరు లేదా నవంబరులో ఎన్నికలు నిర్వహణకు సిద్ధమవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. అందుకే ఎన్నికలకు రెడీ కావాలని కేడర్ కు సంకేతాలు పంపుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90 శాతం స్థానిక సంస్థలు విపక్షం వైసీపీ ఆధీనంలోనే ఉన్నాయి. 2021లో నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలవడంతో కూటమి పార్టీలకు చాలా మండలాలు, జిల్లా పరిషత్ లలో కనీస ప్రాతినిధ్యం లేకపోయింది. ఈ పరిస్థితులలో జడ్పీ, మండల పరిషత్ సమావేశాల్లో అధికార కూటమికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. దీంతో వైసీపీకి చెక్ చెప్పేలా స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాలు గెలుచుకోవాలని కూటమి భావిస్తోందని చెబుతున్నారు.
ఇక మరో నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తయ్యే పరిస్థితి ఉండటంతో గ్రామీణ రాజకీయం వేడెక్కనున్నాయని అంటున్నారు. ప్రస్తుతం రాజకీయం అంతా రాష్ట్రస్థాయిలో కేంద్రీకృతం కాగా, ఈ నాలుగు నెలలు సందడి గ్రామాలు, పట్టణాలకు మారనుందని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమకు గ్రామాల్లో పదవులు లేకపోవడంతో ఖాళీగా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు సైతం ఎన్నికలకు రెడీ అంటున్నారు. దీంతో వచ్చే నాలుగు నెలలు రాజకీయం రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కూటమిలోని మూడు పార్టీలు కలిసికట్టుగానే పోటీ చేస్తాయని చెబుతుండటంతో కూడికలు, తీసివేతలకు సమయం దగ్గరపడిందని చెబుతున్నారు. మొత్తానికి పవన్ ఒక్క మాటతో గ్రామీణ రాజకీయం మొత్తం పూర్తి అలర్ట్ అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
