చిన్నారి అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. ఆ కుటుంబంపై వరాల జల్లు!
వరంగల్ జిల్లా హనుమకొండ ఫోర్ సీ కాలనీకి చెందిన నిరంజన్ అనే ఒక చిన్నారి అభిమాని గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.
By: Madhu Reddy | 17 Jun 2026 1:15 PM ISTకష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడమే కాకుండా మానవత్వం చాటుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హీరోగా ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమందికి ఆర్థికంగా కూడా అండగా నిలిచిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చిన్నారి అభిమాని కోరిక తీర్చి అందరి ప్రశంసలు పొందుతున్నారు. అంతేకాదు ఆ చిన్నారి అభిమాని కుటుంబం పై వరాలజల్లు కురిపించి అందరిని ఆశ్చర్యపరిచారు.
చిన్నారి అభిమానిని కలిసిన పవన్ కళ్యాణ్..
వరంగల్ జిల్లా హనుమకొండ ఫోర్ సీ కాలనీకి చెందిన నిరంజన్ అనే ఒక చిన్నారి అభిమాని గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇక తనకు చిన్నప్పటినుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన వీధిలో అందరూ తనను గబ్బర్ సింగ్ అని పిలుస్తారట. ఎలాగైనా సరే తన అభిమాన హీరోని కలవాలి అని ఎంతగానో పరితపించారు. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జనసేన నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ కు చేరవేయగా .. స్పందించిన ఆయన చిన్నారి అభిమానిని కలిసి ఆ అభిమాని కోరికను నెరవేర్చారు.
అభిమాని కుటుంబానికి అండగా..
పవన్ కళ్యాణ్ ఆ అభిమానిని కలవడమే కాకుండా నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి మరీ తెలుసుకున్నారు. ఇక కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అక్కడికక్కడే అందజేసిన పవన్ కళ్యాణ్ ఆ కుటుంబం ఆర్థికంగా నిలతొక్కుకోవడానికి నిరంజన్ తల్లికి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు నిరంజన్ సోదరి చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని కూడా తెలిపారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ అభిమానిని చూడడమే కాకుండా దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవడం చూసి ఆయన చూపిన మానవత్వానికి, పెద్ద మనసుకు ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమౌతూ పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
చుట్టుముట్టిన అభిమానులు , స్థానికులు..
నిరంజన్ ను కలవడానికి ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలియడంతో హనుమాన్ నగర్ పరిసర ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ అభిమానులు, స్థానికులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇక తనను చూడడానికి వచ్చిన అభిమానులకు, స్థానికులకు పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఆలయ దర్శనానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్..
అభిమాని నిరంజన్ పరామర్శ కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ అక్కడినుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి బయలుదేరి వెళ్లారు. అలా మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. తన మానవతావాదంతో గొప్ప మనసు చాటుకున్నారు.
