పవన్ సినిమా విడుదలపై కుట్ర? అందుకే థియేటర్లు బంద్ అనే అనుమానం!
జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై ఏపీ సినిమాటొగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు.
By: Tupaki Desk | 24 May 2025 11:07 AM ISTఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ను సిని రంగానికి చెందిన ఓ నలుగురు సవాల్ చేస్తున్నారా? పవన్ సినిమా హరహర వీరమల్లు విడుదలను అడ్డుకునే కుట్ర చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ లో పవన్ సినిమా విడుదల అవుతున్న సమయంలో ఆకస్మాత్తుగా థియేటర్లు బంద్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సందేహిస్తున్నారు. ఇందులో తెలుగు సినీ రంగాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఉన్న నలుగురు పెద్దల వ్యవహారశైలిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై ఏపీ సినిమాటొగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసేయాలని నలుగురు పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ జరపాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ ను మంత్రి దుర్గేశ్ సూచించారు. మరోవైపు సినిమా హాళ్లు బంద్ చేస్తే ఏయే సినిమాలు ప్రభావితమవుతాయి. రెవెన్యూ నష్టం ఎంత ఉంటుందన్న విషయమై అధికారులు వివరాలు సేకరిస్తారని జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుంటే, ఆయన ఆధిపత్యం పెరిగిపోతుందని, పవన్ జోక్యాన్ని తగ్గించేలా తెరవెనుక కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు నాలుగేళ్లు కష్టపడి చిత్రీకరించిన హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తుంటే.. ఆ ప్రయత్నాలకు అడ్డుకొంటూ నిర్మాత ఏఎం రత్నంను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కుట్ర, కుతంత్రాలు ఏపీ ప్రభుత్వ సంకల్పానికి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను అవమానించడమే అవుతుందని అంటున్నారు. ఇండస్ట్రీపై ఆధారపడే కార్మికులు జీవితాలను సమస్యల్లోకి నెట్టడమే అవుతుందని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు.
పర్సంటేజీ విధానంలో ఎగ్జిబ్యూటర్లకు అద్దె, కమీషన్ చెల్లింపుపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. పర్సంటేజీ పద్దతిలో చెల్లింపులు జరగకపోతే జూన్ 1వ తేదీ నుంచి సింగిల్ థియేటర్లను మూసివేస్తామని కొందరు డిస్టిబ్యూటర్లు హెచ్చరించారు. మిగిలిన డిస్టిబ్యూటర్లతో సంబంధం లేకుండా ఓ నలుగురు మాత్రమే మొండిగా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనివెనుక పవన్ సినిమాను అడ్డుకోవడమే ప్రధాన వ్యూహంగా అనుమానిస్తున్నారు. వీరి నిర్ణయం వల్ల పవన్ సినిమాతోపాటు జూన్‌లో విడుదలకు సిద్దమవుతున్న థగ్ లైఫ్, కుబేరా, కన్నప్ప వంటి సినిమాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీనిపై ఆయా సినిమా నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
