మాజీ మంత్రి ‘మేకప్’ విమర్శలు.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ వార్నింగ్
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వైసీపీ మాజీ మంత్రి చేసిన విమర్శలపై స్పందించారు.
By: Tupaki Political Desk | 16 Jun 2026 12:50 PM ISTహోంమంత్రి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలను కించపరిచేలా మాజీ మంత్రి గుడివాడ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూటమికి చెందిన మహిళా నేతలు ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హోంమంత్రి అనితకు కూటమి నేతల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వైసీపీ మాజీ మంత్రి చేసిన విమర్శలపై స్పందించారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, అవి కేవలం విధానపరంగా మాత్రమే ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత దాడులకు దిగడం, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీవారు దిగజారిపోయారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని, జాగ్రత్తగా మాట్లాడాలి. హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు కేవలం ఆమె వ్యక్తిగత విషయానికి సంబంధించినవి కావు.. సగటు మహిళలందరినీ కించపరచినట్లే’’ అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాజీవితంలో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటను సమాజం నిశితంగా గమనిస్తోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎదుటి పార్టీ వారు వాచాలత్వంతో, సంస్కారహీనంగా ఇళ్లలోని స్త్రీలను కూడా కించపరిచే నైజం ఉన్నవారైనా.. కూటమి నేతలు మాత్రం ఓపిక పట్టాలని పవన్ సూచించారు. అవతలి పార్టీ వారిలాగా దిగజారుడు భాష, అర్థరహిత వ్యాఖ్యలు చేయడం కూటమికి అవసరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శల్లో ఎంతటి అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయో, వారి సంస్కృతి ఎలాంటిదో పౌర సమాజానికి, ప్రజలకు అర్థమయ్యేలా బలంగా వివరించాలని కూటమి నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వంపై లేదా నేతలపై విమర్శలు చేయాలనుకుంటే ఒక పాలసీ నచ్చకపోతే ఆ విషయంపైనే మాట్లాడాలి కానీ, వ్యక్తిగత దూషణలకు దిగకూడదని హితవు పలికారు. పౌర సమాజం హర్షించే భాషలోనే కూటమి నేతలందరూ మాట్లాడి, ప్రతిపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత రెండు రోజులుగా మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ చేసిన విమర్శలపై కూటమి ఎదురుదాడి చేస్తోంది. మహిళా నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. అదేసమయంలో కూటమికి చెందిన కీలక నాయకులు సైతం ఈ విషయంపై ఫోకస్ చేయడంతో మాజీ మంత్రి గుడివాడను రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను మహిళాలోకం అంతటిని అవమానించేవిగా ఉన్నాయని కూటమి ప్రచారం చేయడం కూడా హీట్ పుట్టిస్తోంది. ఈ ఎదురుదాడిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందన్నదే ఆసక్తి రేపుతోందని అంటున్నారు.
