మాటలు కాదు..చేతల్లోకి పవన్ కల్యాణ్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాటలు వదిలి చేతలు ప్రారంభించారు.
By: Garuda Media | 9 Jun 2026 7:10 PM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాటలు వదిలి చేతలు ప్రారంభించారు. గోదావరి పుష్కరాల ను అత్యంత పవిత్రంగా నిర్వహించాలని నిర్ణయించిన ఆయన.. గోదావరి నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల రెండు రోజుల పాటు.. అక్కడే ఉండి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి ఉపనదులు, ఇతర కాల్వల్లో మురుగునీరు చేరడం,కాలుష్యం పెరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యా నికి కారణాలు తెలుసుకున్నారు. దీనివెనుక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. సోమవారం మరోసారి గోదావరి కాలుష్యంపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ చేతల్లోకి దిగారు.
ముఖ్యంగా ఆంధ్రా పేపర్ మిల్లు నుంచి వచ్చే కాలుష్యం, వ్యర్థాల కారణంగా గోదావరిలో కాలుష్యం పెరిగిపోయిందని నివేదికలు అందడంతో వాటిని ఆమూలాగ్రం పరిశీలించారు. సదరు కంపెనీకి వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాలుష్య కారకా లను వేరే ప్రాంతంలోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలుష్య భూతాన్ని తరిమి కొట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఆంధ్రా పేపర్ మిల్ నుంచి వచ్చే వివరణ తర్వాతచర్యలు తీసుకోవాలని.. అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని కూడా సూచించారు. గోదావరి పుష్కరాలను పవిత్రంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
పర్యావరణ చట్టాలు ఎందుకు?
ఈ సందర్భంగా అధికారులపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆంధ్రా పేపర్ మిల్లు విషయంలో కొన్ని సూచనలు చేశామని అయినా కంపెనీ పట్టించుకోలేదని అధికారులు వివరణ ఇచ్చారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆయన.. పర్యావరణ చట్టాలు ఎందుకు ఉన్నాయి? వాటిని సక్రమంగా అమలు చేయలేరా? అని ప్రశ్నించారు. పర్యావరణ చట్టాల ప్రకారం కాలుష్యానికి కారకులైన వారు ఎలాంటి వారైనా.. ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే వారు పుణ్య స్నానాలు చేశామన్న సంతృప్తితోవెనుదిరగా లని సూచించారు. ఏ ఒక్కరు అసౌకర్యానికి గురైనా అది ప్రభుత్వంపై పడుతుందని చెప్పారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని.. ఏదైనా సమస్య ఉంటే తనకు నేరుగా చెప్పాలని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
