Begin typing your search above and press return to search.

పవన్ సూపర్ స్పీడ్.. గోదావరి ప్రక్షాళనకు హైటెక్ ప్లాన్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలతో యంత్రాంగం ఆఘమేఘాలపై రంగంలోకి దిగిందని చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   29 May 2026 2:42 PM IST
పవన్ సూపర్ స్పీడ్.. గోదావరి ప్రక్షాళనకు హైటెక్ ప్లాన్
X

పవిత్ర గోదావరి ప్రక్షాళనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. వచ్చే ఏడాది పుష్కరాలు నిర్వహిస్తున్నందున ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఇటీవల పవన్ రాజమండ్రిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించగా, గోదావరిలో పెద్ద ఎత్తున కలుషిత జలాలు కలుస్తున్న విషయం వెలుగుచూసింది. కాలుష్య కాషారంగా మారిన నదిలో భక్తులతో స్నానం చేయించడమంటే అంతకంటే పాపం మరొకటి లేదని భావించిన పవన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తక్షణం వంద కోట్లతో నదిలో కలుషిత జలాలు కలవకుండా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా పారిశ్రామిక కాలుష్య నివారణకు నిరంతర తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ద్వారా నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలని యంత్రాంగానికి సూచించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలతో యంత్రాంగం ఆఘమేఘాలపై రంగంలోకి దిగిందని చెబుతున్నారు. గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల పరిధిలో కలుషిత జలాలకు అడ్డుకట్ట వేసే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని అంటున్నారు. కాలుష్యం ఎక్కడ నుంచి ఏ రూపంలో కలుస్తుంది గుర్తించి వాటి నివారణకు ప్రణాళికలు రూపొందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మురుగునీటితోపాటు పారిశ్రామిక జలాలు, ఆక్వా కాలుష్యాన్ని వర్గీకరించి వాటి శుద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. నదిలోకి ఒక్క చుక్క మురుగు నీరు కూడా చేరకుండా నిలువరించడమే ధ్యేయంగా అధికారులకు డిప్యూటీ సీఎం అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.

డిప్యూటీ సీఎం సూచనలతో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు గోదావరి పరివాహ ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి నదిలో కలుషిత జలాలపై లెక్కలు సేకరించారు. కాలుష్యంతో గోదావరి నది ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకున్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. ఆరు జిల్లాల పరిధిలోని పట్టణాల నుంచి రోజుకు 104 మిలియన్ లీటర్ల మురుగునీరు నదిలో కలుస్తోందని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ 8.38 మిలియన్ లీటర్ల మురుగు నీరు చేరుతోందని గుర్తించారు. పారిశ్రామిక వ్యర్థాల్లో ఒక్క ‘ఆంధ్ర పేపర్స్’ వెదజల్లే రోజువారీ కాలుష్యమే ఏకంగా 32 మిలియన్ లీటర్లుగా ఉందని చెబుతున్నారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిత్యం విడుదలయ్యే 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటికి అదనమని పీసీబీ అధికారులు తేల్చారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కు నివేదిక సమర్పించగా, ఆయన పక్కా ప్రణాళిక విడుదల చేసి కాలుష్యానికి చెక్ చెప్పాలని నిర్దేశించినట్లు చెబుతున్నారు.

పల్లెల్లో మ్యాజిక్ డ్రెయిన్లు

గోదావరి పరివాహక ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు నదిలో కలుస్తున్నట్లు అధికారులు గుర్తించడంతో ఇకపై ఆ మురుగు గోదావరిలో చేరకుండా మ్యాజిక్ డ్రైయిన్లతో చెక్ చెప్పాలని డిప్యూటీ సీఎం ఆదేశించినట్లు సమాచారం. మొత్తం 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీలు గోదావరిని ఆనుకుని ఉన్నాయి. వీటిని పుష్కర పంచాయతీలుగా గుర్తించి వంద శాతం మురుగురహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అదేవిధంగా గృహ వినియోగ మురుగు నీటి నియంత్రణకు సామాజిక ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. ఈ పనుల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మంజూరు చేసిన రూ. 100 కోట్లను వినియోగించాలని స్పష్టం చేశారు.

పట్టణాల్లో మురుగు శుద్ధి ప్లాంట్లు

అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న పట్టణాలు, నగరాల నుంచి కూడా భారీ ఎత్తున కాలుష్యం నదిలో కలుస్తోందని చెబుతున్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ నుంచి రోజుకు 75 మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతుండగా, అందులో 50 మిలియన్ లీటర్లు నేరుగా గోదావరిలోనే కలుస్తోందని గుర్తించారు. అదేవిధంగా తణుకు, భీమవరం, నరసాపురం, కొవ్వూరు మున్సిపాలిటీల నుంచి యనమదుర్రు, గోస్తనీ వంటి డ్రెయిన్ల ద్వారా పెద్ద ఎత్తున వ్యర్థ జలాలు నదిలోకి వదులుతుండటంపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. ఇకపై ఈ నీటిని శుద్ది చేసేందుకు ప్రతి మున్సిపాలిటీలో మురుగు శుద్ధి కేంద్రాల (STP) నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా గోదావరి పరివాహక మున్సిపాలిటీలన్నింటిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై దశలవారీ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.

థర్డ్ ఐ నిఘా

నదిలోకి దొంగచాటుగా మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలను వదిలేవారిపై నిఘా పెట్టేందుకు ఒక హైటెక్ పర్యవేక్షణా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఆర్టీజీఎస్ తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల ద్వారా వ్యర్థాల శుద్ధి, విడుదలపై నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహిస్తారు. పరిశ్రమల మురుగు నీటి నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఆధునిక సాంకేతికతతో కూడిన కాలుష్య నివారణ వ్యవస్థలను పరిశ్రమలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇక ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి ‘పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్’కి ఈ కంట్రోల్ రూమ్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.