ఆర్ కే రోజాకు కర్ర కాల్చినట్లుగా కౌంటర్ వేసిన పవన్ కల్యాణ్
‘అడ్డదిడ్డంగా మాట్లాడటం’ అనే కళను మాజీ మంత్రి ఆర్కే రోజా ఎంతలా వాడేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 24 July 2025 9:35 AM IST‘అడ్డదిడ్డంగా మాట్లాడటం’ అనే కళను మాజీ మంత్రి ఆర్కే రోజా ఎంతలా వాడేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను ఉద్దేశించి ఒక్క మాట అనకున్నా.. పవన్ కల్యాణ్ మీద తరచూ ఒంటి కాలి మీద లేచే అలవాటున్న ఆమెకు సరైన కౌంటర్ ఇప్పటివరకు పవన్ ఇచ్చింది లేదు. ఆ కొరతను తీరుస్తూ.. ఈ మధ్యనే ఆమె అన్న మాటలకు కౌంటర్ ఎటాక్ కు దిగారు ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన వీడియోలో ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను ప్రాతినిధ్యం వహించే నగరిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె తనదైన రీతిలో మండిపడ్డారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువ అయ్యారన్న ఆర్కే రోజా.. తమ పార్టీ (వైసీపీ) మళ్లీ అధికారంలోకి వస్తే.. టీడీపీ.. జనసేన నేతలు అమెరికాకు పారిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ హైదరాబాద్ వదిలి విదేశాల దిశగా వెళుతున్నారని.. రేపు అమెరికా బాట పడతారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మానసిక పరిస్థితి బాగోలేదన్న ఆమె.. ‘ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టానంటున్నాడు’ అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారటం..తాజాగా విశాఖ వేదికగా జరిగిన హరిహర వీరమల్లు మూవీ వేడుకలో పవన్ స్పందించారు.
ఆర్కే రోజాను నేరుగా కోట్ చేయని పవన్ కల్యాణ్.. తనను ఉద్దేశించి అన్న మాటను ప్రస్తావిస్తూ కౌంటర్ అటాక్ కు దిగారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న ఆయన.. ‘నేను ఈ మాట చెబితే.. ఎక్కడికి వెళితే అక్కడ పవన్ అక్కడే పుట్టానని.. అక్కడే పెరిగానని కొందరు విమర్శిస్తుంటారు. మా నాన్న ఉద్యోగంలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కూపస్థ మండూకాలు. బావిలో కప్పులు. వాళ్లు అంతకుమించి ఆలోచించలేరు’ అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు.
అందుకే తన పేరే పవనమని.. తాను అంతటా ఉంటానని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ.. ఇప్పటికే పలుమార్లు ఆర్కే రోజా నోరు పారేసుకున్నా.. పెద్దగా రియాక్టు కాని పవన్ కల్యాణ్.. తన తీరుకు భిన్నంగా రోజా వ్యాఖ్యలు వైరల్ అయిన కొద్ది గంటల్లోనే ఘాటుగా రియాక్టు కావటం గమనార్హం.
