గిరిజనుల పాదాలకు పవన్ చెప్పులు.. డిప్యూటీ సీఎం దాతృత్వం పీక్స్!
ఇందులో భాగంగా... తాజాగా తన సొంత డబ్బులతో 300 మంది గిరిజనులకు తాజాగా ఆయన నాణ్యమైన పాదరక్షలు పంపిణీ చేశారు.
By: Tupaki Desk | 17 April 2025 6:27 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా.. తన శాఖల పనితీరు విషయంలో తనదైన దూకుడు ప్రదర్శిస్తూ.. ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పవన్ కల్యాణ్. ఈ సమయంలో ఆయన వ్యక్తిగత దాతృత్వం విషయంలోనూ పార్టీ అభిమానుల, సామాన్య ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.
అవును... ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన దాతృత్వాన్ని చాటుకుంటున్న సంగతి తెలిసిందే. తన సొంత నిధుల నుంచి తరచూ ఆయన కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురంలో 10,000 మంది మహిళలకు చీరలు పంపినీ చేసిన విషయం ఇందుకు ఓ ఉదాహరణ.
ప్రధానంగా తనను ఎంతో ఆదరించి, భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతీ కుటుంబానికీ తాను పసుపు కుంకుమ కింద వీటిని పంపించారు. స్వయంగా ఆయన పంపిణీ చేయలేకపోయినప్పటికీ, అది ప్రాక్టికల్ గా సాధ్యం కానప్పటికీ.. పార్టీ నాయకులతో ఆయన పంపిణీ చేశారు.
ఈ వ్యవహారం స్థానికంగా పవన్ గ్రాఫ్ పెంచడమే కాకుండా.. పవన్ కల్యాణ్ లోని దాతృత్వ గుణంతో పాటు ఆయనకున్న కృతజ్ఞతా భావాన్ని చర్చకు తెచ్చింది. ఆ సమయంలో ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫుల్ ఫిదా అయిన పరిస్థితి. ఈ సమయంలో మరోసారి పవన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
ఇందులో భాగంగా... తాజాగా తన సొంత డబ్బులతో 300 మంది గిరిజనులకు తాజాగా ఆయన నాణ్యమైన పాదరక్షలు పంపిణీ చేశారు. వీటిని తన కార్యాలయ అధికారులకు ఇచ్చి పవన్ పంపించారు. దీంతో.. గురువారం నాడు కురిడి, పెదపాడు గ్రామాల్లో పర్యటించిన అధికారులు.. పవన్ పంపిన పాదరక్షలు గిరిజనులకు పంపిణీ చేశారు.
కాగా... ఇటీవల గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు "అడవితల్లి బాట" పేరుతో పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పెదపాడు, కురిడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సమయంలో అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతోపాటు.. ఎక్కడికక్కడ ముళ్లు, రాళ్లు ఉండటం గమనించారు. అయితే అలాంటి రోడ్లపై చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి చలించిపోయిన ఆయన.. వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్థోమత లేదని విన్నారు. దీంతో.. 300 జతల చెప్పులు పంపించారు.
