డిప్రెషన్ కు ‘పవన్’ చిట్కా..
డిప్రెషన్ లో ఉన్న కోలుకోవాలంటే ఏం చేయాలి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనల ప్రకారం ఓ పూట తిండి మానేసి, పొలం పనో, తోట పనో చేసుకుంటే సరిపోతుంది.
By: Tupaki Desk | 2 May 2025 3:10 PMడిప్రెషన్ లో ఉన్న కోలుకోవాలంటే ఏం చేయాలి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనల ప్రకారం ఓ పూట తిండి మానేసి, పొలం పనో, తోట పనో చేసుకుంటే సరిపోతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు ఈ చిట్కా. తన కుటుంబ సభ్యులు ఎవరైనా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తన వద్దకు వస్తే వారికి నేనిచ్చే సలహా ఇదేనంటూ చెప్పారు పవన్.
మేడే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ కష్టపడి పని చేసేవారు డిప్రెషన్ కు గురికారని చెప్పారు. ‘‘ఒకసారి మా ఇంట్లో పిల్లలకు చెబుతాను, డిప్రెషన్ లో ఉన్నామంటే అన్నం తినడం మానేసి తోట పనిచేయాలి. నిజంగా యువత బాగుండాలి అంటే జీవితంలో డిప్రెషన్ కు చోటు ఉండకూడదు. కష్టపడి పనిచేసేవాడికి డిప్రెషన్ వచ్చే ఆస్కారం లేదు. కష్టపడి పనిచేసేవాడు ఎప్పుడు తన కడుపు నిండుతుందా? అని ఎదురుచూస్తాడు. అందుకే వారికి డిప్రెషన్ అంటూ ఉండదు.’’ అంటూ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్.
పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శారీరిక, మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే జనసేనాని యువత ఒత్తిడిని అధిగమించాలని సూచించారు. కష్టపడి పనిచేస్తే ఎవరూ ఒత్తిడికి గురయ్యే పరిస్థితి రాదంటున్నారు. సినిమాలు, రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే డిప్యూటీ సీఎం సొంతంగా తోటపని చేస్తుంటారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన పనిచేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఎంతటి పని ఒత్తిడి ఉన్నా, పవన్ హ్యాపీగా ఉండటానికి ఇదే కారణమా? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.