Begin typing your search above and press return to search.

పెద్ద పెద్ద మాటలు ఆడే ఆ నేతలు ఎవరు? పవన్ కామెంట్స్ వైరల్

కొందరు నేతలు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఢిల్లీ మెడలు వంచుతామని, చొక్కాలు పట్టుకుని నేలకు దించుతాం.. తడాఖా చూపిస్తామని పెద్ద పెద్ద మాటలు ఆడుతుంటారు.

By:  Tupaki Political Desk   |   15 Jun 2026 6:33 PM IST
పెద్ద పెద్ద మాటలు ఆడే ఆ నేతలు ఎవరు? పవన్ కామెంట్స్ వైరల్
X

ఢిల్లీ వేదికగా జరిగిన జనసేన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొందరు నేతలు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఢిల్లీ మెడలు వంచుతామని, చొక్కాలు పట్టుకుని నేలకు దించుతాం.. తడాఖా చూపిస్తామని పెద్ద పెద్ద మాటలు ఆడుతుంటారు. కానీ అటువంటి వారు ఢిల్లీకి వచ్చిన తర్వాత అటువంటి మాటలు మాట్లాడరు? గొంతులు పెగలవు అనుకుంటా? అంటూ పవన్ వ్యాఖ్యానించారు. దక్షిణాది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు ఇలాంటి మాటలు ఆడుతుంటారని పవన్ ఆరోపించారు. దీంతో పవన్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనేది హాట్ టాపిక్ అవుతోంది.

ఇటీవల కాలంలో జనసేనను జాతీయస్థాయికి విస్తరించాలనే ఆలోచనతో డిప్యూటీ సీఎం పవన్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో డిప్యూటీ సీఎం పావులు కదుపుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో నవ నిర్మాణ సంకల్ప సభ నిర్వహించాలని ప్రయత్నించారు. ఈ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

దీంతోనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే నేటికీ అసమానతలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కొందరు నాయకులు రాజకీయ సరిహద్దులు గీస్తున్నారని మండిపడ్డారు. దీంతో పవన్ ఆగ్రహం అంతా కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకునేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఢిల్లీ మెడలు వంచుతాం.. చొక్క పట్టుకుని నేలకు దించుతాం అంటూ పవన్ ఎత్తి చూపిన వ్యాఖ్యలు ఎవరో ఒకరిద్దరు నేతలకు సంబంధించినవి అయి ఉండవచ్చునని అంటున్నారు.

ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు అంటూ పవన్ విమర్శలు గుప్పించడంతో పలువురి పేర్లను ఉదహరిస్తూ వారిలో ఎవరిని ఉద్దేశించి పవన్ ఆ కామెంట్లు చేసి ఉండొచ్చునని చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే గట్టిగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఏపీలో వైసీపీ ఈ స్థాయిలో విమర్శలు ఎప్పుడూ చేయకపోవడంతో పవన్ టార్గెట్ తెలంగాణలోని రెండు ప్రధాన పార్టీలే కావొచ్చునని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర నేతలు లేదా బీఆర్ఎస్ అగ్ర నాయకులను ఉద్దేశించి పవన్ ఆ కామెంట్స్ చేశారా? అని అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల కొత్తగా పార్టీ పెట్టిన టీఆర్ఎస్ నాయకురాలు కవితపైనా ఆ విమర్శలు చేసివుండొచ్చునని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఎవరి పేరు చెప్పకుండా ఢిల్లీలో అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హడావుడి చేసేవారు ఇక్కడకు వచ్చి కిక్కుమనరని చెప్పడం ద్వారా పవన్ ఆ నేతల గాలి తీసేశారని అంటున్నారు.