తప్పు ఎవరిది? పవన్ కళ్యాణ్ పోస్టుమార్టం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్‌ను నిందించారు.
By: Tupaki Desk | 8 April 2025 4:35 AMవిశాఖపట్నంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా కొందరు ఐఐటీ జేఈఈ రాసే విద్యార్థులు తమ పరీక్షలను అందుకోలేకపోయారనే ప్రచారం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా విధించిన ట్రాఫిక్ ఆంక్షల కారణంగానే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోలేకపోయారని కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి వైరల్ చేస్తున్నారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్‌ను నిందించారు. విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా రావడానికి కళ్యాణ్ కాన్వాయే కారణమని కొన్ని వీడియోలను కూడా షేర్ చేశారు.
అయితే, ఈ కథనం అవాస్తవమని విశాఖపట్నం పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు తమ ప్రకటనలో విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం కాదని తేల్చి చెప్పారు. పరీక్ష ఉదయం 8:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, విద్యార్థులు 7:00 గంటలకల్లా రిపోర్ట్ చేయాలని సూచించారు. ముఖ్యంగా, ఉదయం 8:30 గంటల తర్వాత ఏ విద్యార్థిని పరీక్షా హాల్లోకి అనుమతించేది లేదు. ఇక కాన్వాయ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ఉదయం 8:41 గంటలకు ఆ ప్రాంతం గుండా వెళ్లిందని పోలీసులు ధృవీకరించారు. అంటే పరీక్ష సమయం ముగిసిన తర్వాత కాన్వాయ్ అక్కడికి చేరుకుంది. కాబట్టి కళ్యాణ్ కాన్వాయ్ కారణంగానే విద్యార్థులు పరీక్షను కోల్పోయారని చెప్పడానికి ఎటువంటి తార్కిక ఆధారం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
అంతేకాకుండా గోపాలపట్నం నుండి పెందుర్తి వెళ్లే సర్వీస్ రోడ్డును ఉదయం 8:30 గంటల వరకు విద్యార్థుల కోసం ఎటువంటి ఆటంకం లేకుండా ఉంచారని పోలీసులు తెలిపారు. విద్యార్థులను ఒక భావోద్వేగ అంశంగా చూపి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారం విశ్వసనీయత లేనిదని వారు తేల్చి చెప్పారు.
- విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్
మరోవైపు, పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు హాజరు కాలేకపోయిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనకు దారితీసిన వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్‌ను నిలిపివేశారు? పరీక్షా కేంద్రం వద్దకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్‌ను ఏమైనా నియంత్రించారా? అనే అంశాలపై విచారణ చేయాలని విశాఖపట్నం పోలీసులకు ఆయన స్పష్టం చేశారు.
తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ చెబుతుంటారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంగా స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ నియంత్రించాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. పోలీసులు కూడా అదే విధంగా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారని, హెలికాప్టర్‌లో వెళ్లినా రోడ్డుపై ట్రాఫిక్ నిలపడం లేదా చెట్లు కొట్టడం వంటి చర్యలు చేపట్టడం లేదని వారు వివరించారు. పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు వంటి కార్యక్రమాలు, ట్రాఫిక్ అంతరాయాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయని వారు గుర్తు చేశారు. ప్రతి పర్యటనలోనూ పార్టీ నేతలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని, ఈ పర్యటనలో కూడా పార్టీ నాయకులు అదే క్రమశిక్షణను పాటించారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సి ఉంది.