Begin typing your search above and press return to search.

‘మీ అయ్య జాగీరా’ అని ఎందుకు అనాల్సివచ్చిందంటే.. పవన్ క్లారిటీ

ఇటీవల కాలంలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన తన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తి వివరణ ఇచ్చారు.

By:  Tupaki Political Desk   |   10 Jun 2026 11:52 PM IST
‘మీ అయ్య జాగీరా’ అని ఎందుకు అనాల్సివచ్చిందంటే.. పవన్ క్లారిటీ
X

ఇటీవల కాలంలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన తన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తి వివరణ ఇచ్చారు. ఎన్డీఏ పార్టీల సమావేశానికి ఢిల్లీ వచ్చిన పవన్ ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ నేతలతో వివాదానికి కారణమైన ‘మీ అయ్య జాగీర’ అన్న వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. గత కొంతకాలంగా తనను లక్ష్యంగా చేసుకున్న వారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినట్లు పవన్ వెల్లడించారు.

తనను హైదరాబాద్ రావొద్దంటూ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోందని పవన్ ఆరోపించారు. గత 13 నెలలుగా వ్యక్తిగతంగా, రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడం వల్లే తాను స్పందించాల్సివచ్చిందని వివరించారు. ‘‘ఒక భారతీయ పౌరుడిగా దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ నాకుంది. నన్ను హైదరాబాద్ రావొద్దనడాన్ని నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడంగా భావించాను. అందుకే అంతటి తీవ్ర పదజాలంతో "హైదరాబాద్ ఏమైనా మీ అయ్య జాగీరా?" అని ప్రశ్నించాల్సి వచ్చిందని పవన్ స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ హయాంలో ఇలా లేదు

గతంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంకుచిత వైఖరి గానీ, నన్ను అడ్డుకునే ప్రయత్నాలు గానీ ఎప్పుడూ జరగలేదని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. తనను హైదరాబాద్ రావొద్దని కాంగ్రెస్ నేతలు మాట్లాడితే... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా దక్షిణ భారతావనితో ఎలాంటి సంబంధం లేదని ఇక్కడి ప్రజలకు చెప్పాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

లోకేశ్ కోసమే తెలంగాణపై ఫోకస్? పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి నారా లోకేశ్‌కు రాజకీయంగా పోటీ ఇవ్వకుండా ఉండేందుకే, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారంటూ వస్తున్న విమర్శలను జనసేనాని పూర్తిగా తోసిపుచ్చారు. "ఏపీలో లోకేశ్‌తో పోటీ వల్లే నేను తెలంగాణపై దృష్టి పెట్టాననే వాదనల్లో ఎలాంటి నిజం లేదు. ఆ ప్రచారాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నా రాజకీయ ప్రస్థానం, జనసేన వ్యూహాలు స్పష్టమైన ఆశయాలతో కూడుకున్నవి. ఒకరి కోసం లేదా మరొకరితో పోటీ పడటానికి నా రాజకీయ నిర్ణయాలు ఉండవు" అని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.

తెలంగాణలో జనసేన పార్టీకి లక్షన్నర మంది కార్యకర్తల సభ్యత్వం ఉందని, వారంతా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని పవన్ వెల్లడించారు. అలాంటి వారి కోసం తాను తెలంగాణలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా తాను తెలంగాణకు వ్యతిరేకం అన్న ఆరోపణలను ఆయన ఖండించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరునే తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.